3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఐటీ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగానే ఉన్నాయి.

Updated : 17 Apr 2024 01:55 IST

సమీక్ష

టీ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగానే ఉన్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.  డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు తగ్గి 83.61 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు   0.26% నష్టంతో 89.87 వద్ద ముగిసింది. 

 • వరుస నష్టాలతో మదుపర్ల సంపదగా పరిగణింà ేబీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత 3 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.7.93 లక్షల కోట్లు తగ్గి రూ.394.25 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 2,094.47 పాయింట్లు కోల్పోయింది.

సెన్సెక్స్‌ ఉదయం 72,892.14 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా అదే ధోరణిలో కదలాడిన సూచీ, ఒకదశలో 72,685.03 పాయింట్లకు పడిపోయింది. చివరకు 456.10 పాయింట్ల నష్టంతో 72,943.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 124.60 పాయింట్లు తగ్గి 22,147.90 దగ్గర స్థిరపడింది.

 • బ్లాక్‌రాక్‌తో కలిసి వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకింగ్‌ వ్యాపారాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో జియో ఫైనాన్షియల్‌ షేరు 2.10% లాభపడి రూ.361.85 వద్ద ముగిసింది. 
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 డీలాపడ్డాయి. ఇన్ఫోసిస్‌ 3.65%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.12%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.34%, విప్రో 2.32%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.94%, టెక్‌ మహీంద్రా 1.90%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.80%, టీసీఎస్‌ 1.76%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.74%, ఎల్‌ అండ్‌ టీ  1.55% నష్టపోయాయి. టైటన్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ 1.26% లాభపడ్డాయి.  
 • వచ్చే 4-5 ఏళ్లలో పడకల సామర్థ్యాన్ని రెట్టింపు చేసి 8,000కు పెంచేందుకు రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఇందులో సగానికి పైగా పెట్టుబడులు ఉత్తర్‌ప్రదేశ్‌లో పెట్టనున్నట్లు సంస్థ ఛైర్మన్‌, ఎండీ అభయ్‌ సోయ్‌ తెలిపారు. గతేడాది లఖ్‌నవూలో సహారా హాస్పిటల్‌ను రూ.940 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ, మ్యాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా పేరు మార్చింది.
 • పియాలా టెర్మినల్‌ నుంచి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి 35 కిలోమీటర్ల మేర విమాన ఇంధన (ఏటీఎఫ్‌) సరఫరా పైప్‌లైన్‌ను భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) నిర్మించనున్నట్లు నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ తెలిపింది. బీపీసీఎల్‌ పియాలా టెర్మినల్‌ హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉంది.
 • హీటింగ్‌ పరికరాల తయారీ సంస్థ జేఎన్‌కే ఇండియా ఐపీఓ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఐపీఓల భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 84.21 లక్షల వరకు ఈక్విటీ షేర్లకు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు విక్రయించనున్నారు.
 • హెచ్‌డీఎఫ్‌సీ మాజీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అండదండలున్న, కిడ్నీ సంరక్షణ సేవల సంస్థ నెఫ్రో కేర్‌ ఇండియా ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు, సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఐపీఓ నిధులను కోల్‌కతాలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేసేందుకు వినియోగించనున్నారు.
 • పీసీ జువెలర్‌ రూ.2000 కోట్ల సమీకరణ: రైట్స్‌ ఇష్యూలు, ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఫుల్లీ కన్వెర్టబుల్‌ వారెంట్ల ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపిందని పీసీ జువెలర్‌ మంగళవారం ప్రకటించింది. ఇందులో రూ.1500 కోట్లను రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించనుంది.
 • థైసన్‌క్రప్‌ ఇండస్ట్రీస్‌ ఇండియాలో అదనపు వాటా కొనుగోలు చేయాలన్న ప్రోటాస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ, పహర్‌పుర్‌ కూలింగ్‌ టవర్స్‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
 • మార్చి త్రైమాసికంలో అమెరికా సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌ వాటా పెంచుకున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పొరపాటుగా నమోదు కావడంతో పతంజలి ఫుడ్స్‌ షేరు 5.41% పెరిగి రూ.1,407.70 వద్ద ముగిసింది. మంగళవారం సాయంత్రం 4.15కు కంపెనీ షేర్‌హోల్డింగ్‌ సమాచారాన్ని సవరించింది.
 • చైనా వృద్ధి 5.3%: ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో చైనా ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి 5.3% వృద్ధిని నమోదుచేసింది. వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బలమైన గిరాకీ ఇందుకు దోహదపడ్డాయి. విశ్లేషకులు 4.8 శాతం వృద్ధినే అంచనా వేశారు. 2023 అక్టోబరు-డిసెంబరులో చైనా వృద్ధిరేటు 1.6 శాతమే కావడం గమనార్హం. కొవిడ్‌ పరిణామాల అనంతరం పుంజుకునేందుకు చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. గిరాకీ తగ్గడం, స్థిరాస్తి రంగంలో సంక్షోభం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తాజా గణాంకాలు చైనాకు ఉపశమనం అందించాయి.

నేడు మార్కెట్లకు సెలవు

శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పని చేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేయనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని