సంక్షిప్తవార్తలు (2)

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ), లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

Published : 20 Apr 2024 03:46 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ, జీఐసీలో ప్రభుత్వ వాటా విక్రయం!

దిల్లీ: జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ), లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్లపత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘జీఐసీలో వాటా విక్రయం కోసం ప్రభుత్వం నిర్వహించిన ‘ఇన్వెస్టర్‌ రోడ్‌షోస్‌’లో మంచి స్పందన లభించింది. అందువల్ల షేరు ‘విలువ’ను బట్టి, దశల వారీగా కంపెనీలో తన 10% వాటా విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉంద’ని ఓ అధికారి తెలిపారు. శుక్రవారం షేరు ముగింపు ధర ఆధారంగా, 10% వాటా విలువ రూ.5,700 కోట్లుగా ఉంది. గత ఆరు నెలల్లో జీఐసీ షేరు 45%  రాణించింది.

సెబీ నిబంధనల ప్రకారం: ఎల్‌ఐసీ 2022లో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. అప్పటి నుంచి ఏడేళ్లలో 10% వాటా, 10 ఏళ్లలో 25% వాటా విక్రయించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడు సెబీ నిబంధనల ప్రకారం కంపెనీలో ప్రజా వాటా ఉంటుంది. షేరు ధరకు అనుగుణంగా, మదుపర్ల ఆసక్తిని బట్టి ‘చిన్న’ మొత్తాల్లో ప్రభుత్వం తన వాటా విక్రయించాలనుకుంటోందని సమాచారం. గత ఆరు నెలల్లో ఎల్‌ఐసీ షేరు విలువ 58% పెరిగింది. ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వం 3.5% వాటాను గతంలో విక్రయించగా.. ఇండెక్స్‌ ఫండ్‌లో ఎల్‌ఐసీని చేర్చడం కోసం మరో 1.5% వాటా విక్రయించాలని అప్పట్లో ప్రణాళిక వేసింది. శుక్రవారం నాటి ఎల్‌ఐసీ షేరు ముగింపు ధర (రూ.973) ప్రకారం సంస్థలో 1.5% వాటా విలువ రూ.9,200 కోట్లుగా ఉంది.


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభంలో 44% వృద్ధి

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) నికర లాభం 44% పెరిగి రూ.541.10 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసికంలో రూ.376.10 కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం  రూ.637.80 కోట్ల నుంచి 33% పెరిగి రూ.851 కోట్లకు చేరింది. వ్యయాలు కూడా 18% పెరిగి రూ.172 కోట్లుగా నమోదయ్యాయి. 2024 మార్చి చివరికి కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ సగటున రూ.6.13 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఈ విలువ రూ.4.5 లక్షల కోట్లుగా నమోదైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని