బిట్‌కాయిన్‌ తాజా ‘హాఫింగ్‌’ ప్రక్రియ పూర్తి

ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ శుక్రవారం నాడు తాజా ‘హాఫింగ్‌’ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Published : 21 Apr 2024 02:30 IST

న్యూయార్క్‌: ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ శుక్రవారం నాడు తాజా ‘హాఫింగ్‌’ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్త బిట్‌కాయిన్‌ల సృష్టిని తగ్గించే ఉద్దేశంతో సుమారు ప్రతి నాలుగేళ్లకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. బిట్‌కాయిన్‌ను తొలుత సృష్టించినప్పుడే మొత్తంగా 2.1 కోట్ల బిట్‌కాయిన్‌లే చలామణిలో ఉండాలన్న పరిమితి ఉంది. అందుకని ప్రతి నాలుగేళ్లకోసారి కొత్త బిట్‌కాయిన్‌ల సృష్టించడాన్ని తగ్గించేందుకు బిట్‌కాయిన్‌ ‘హాఫింగ్‌’ కోడ్‌ను రూపొందించారు. బిట్‌కాయిన్‌ మైనర్‌లు.. తమ కంప్యూటింగ్‌ పవర్‌ ద్వారా కఠినమైన గణిత పజిల్‌ను పరిష్కరించి బ్లాక్‌ చెయిన్‌ను రూపొందిస్తారు. తద్వారా కొత్త బిట్‌కాయిన్‌ల రూపంలో రివార్డులు పొందుతారు. ఇలా బ్లాక్‌చెయిన్‌కు 2,10,000 బ్లాక్స్‌ జత అయిన ప్రతిసారి ‘హాఫింగ్‌’ ప్రక్రియ జరిగేలా బ్లాక్‌చెయిన్‌ సాంతకేతికను రూపొందించారు. ఇది సుమారు ప్రతి నాలుగేళ్లకు జరుగుతుంది. ప్రస్తుతం  1.9 కోట్ల బిట్‌కాయిన్‌లను మైనింగ్‌ ద్వారా చలామణిలోకి తెచ్చారు. ఇంకా 15 లక్ష వరకు బిట్‌కాయిన్‌లను మైనింగ్‌ చేయాల్సి ఉంది. హాఫింగ్‌ ప్రక్రియతో బిట్‌కాయిన్‌ల సృష్టి నెమ్మదించడమే కాకుండా.. బిట్‌కాయిన్‌లను మైనింగ్‌ చేసే వాళ్లకు బిట్‌కాయిన్‌ రివార్డులు తగ్గుతాయి. కాగా.. శుక్రవారం బిట్‌కాయిన్‌ ‘హాఫింగ్‌’ ప్రక్రియ పూర్తయిన అనంతరం.. స్వల్పంగా 0.47 శాతం నష్టపోయి 63,747 డాలర్ల వద్ద కదలాడింది. ఇటీవల మార్చిలో బిట్‌కాయిన్‌ 73,803.25 డాలర్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని