ఆరోగ్య బీమాకు వయోపరిమితి రద్దు

ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది.

Published : 22 Apr 2024 02:10 IST

ఇప్పటివరకు 65 ఏళ్ల వరకే

దిల్లీ: ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది. దీంతో ఇకపై ఏ వయసువారైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఐఆర్‌డీఏఐ గెజెట్‌ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరోగ్యసంరక్షణ వ్యయాల నుంచి పాలసీదార్లకు రక్షణ లభిస్తుందని, బీమా మార్కెట్‌ విస్తరిస్తుందని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది. ‘అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా పాలసీలను కంపెనీలు తీసుకురావాలి. వయోవృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీలు, ఇతర వర్గాల వారి కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను రూపొందించాలి’ అని ఐఆర్‌డీఏఐ ఇటీవలి గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

  • ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ, ఆరోగ్య బీమా పాలసీలను అందించాలని సంస్థలను ఆదేశించింది. క్యాన్సర్‌, గుండె జబ్బు, ఎయిడ్స్‌ వంటి క్లిష్టతరమైన వ్యాధులతో బాధపడుతున్నారంటూ, ఆరోగ్య బీమా పాలసీలను నిరాకరించడం ఇక కంపెనీలకు కుదరదు.
  • పాలసీదార్ల సౌకర్యార్థం బీమా ప్రీమియం మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించేందుకు కంపెనీలు అనుమతి ఇవ్వొచ్చు. ప్రయాణ పాలసీలను సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు మాత్రమే అందించాలి.
  • ఆయుష్‌ చికిత్స కవరేజీకి పరిమితి లేదు. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి వంటి చికిత్సలకు కూడా బీమా మొత్తం లభిస్తుంది.
  • ప్రయోజన ఆధారిత పాలసీలు కలిగిన పాలసీదార్లు పలు సంస్థల వద్ద క్లెయిమ్‌లు దాఖలు చేసుకోవచ్చు. వయోవృద్ధుల క్లెయిమ్‌లు, ఫిర్యాదులను ప్రత్యేక వ్యవస్థ ద్వారా పరిష్కరించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు