సంక్షిప్త వార్తలు(8)

ఫోక్స్‌వ్యాగన్‌ తన స్పోర్ట్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) టైగన్‌లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది.

Published : 24 Apr 2024 02:31 IST

ఫోక్స్‌వ్యాగన్‌ టైగన్‌లో కొత్త వేరియంట్లు

చెన్నై: ఫోక్స్‌వ్యాగన్‌ తన స్పోర్ట్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) టైగన్‌లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. 1 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌ కలిగిన టైగన్‌ జీటీ లైన్‌ ధర రూ.14.08 లక్షలు, 1.5 లీటర్‌ టీఎస్‌ఐ ఇంజిన్‌ కలిగిన టైగన్‌ జీటీ ప్లస్‌ స్పోర్ట్‌ ధర రూ.18.53 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు.


హైదరాబాద్‌లో హిటాచీ ఎనర్జీ జీసీసీ!

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు ఇతర హై వోల్టోజ్‌ పరికరాలు, సాంకేతిక సేవలను అందించే హిటాచీ ఎనర్జీ.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్‌ (జీసీసీ) నెలకొల్పే యోచనలో ఉంది. పుణె నగరాన్నీ ఇందుకోసం పరిశీలిస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ నూగూరి వేణు తెలిపారు. సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్థ విస్తరణ కోసం ఏటా రూ.100 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 19 ఫ్యాక్టరీలున్నాయని తెలిపారు. వరంగల్‌ ఎన్‌ఐటీతో కలిసి అక్కడ ఒక సస్టైనబిలిటీ ఎనర్జీ ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా తమకు 7,000 మంది ఉద్యోగులున్నారని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్ల ఆదాయాన్ని,   రూ.93.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు.


పీఓఎస్‌, క్యూఆర్‌ కోడ్‌, స్పీకర్‌ అన్నీ ఒకదాంట్లోనే

భారత్‌పే నుంచి ఆల్‌-ఇన్‌-వన్‌ పేమెంట్‌ డివైజ్‌

దిల్లీ: దేశీయ ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే, ఆల్‌-ఇన్‌-ఒన్‌ చెల్లింపు ఉత్పత్తి అయిన ‘భారత్‌పే వన్‌’ను మంగళవారం ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌), క్యూఆర్‌ కోడ్‌, స్పీకర్‌.. అన్నీ ఒకే పరికరంలో ఉంటాయి. తొలి దశలో దాదాపు 100 నగరాల్లో దీనిని తీసుకువచ్చి, 6 నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. ‘హైడెఫినిషన్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో భారత్‌పే వన్‌ అత్యున్నత భద్రత, పనితీరును కనబరచగలద’ని సంస్థ పేర్కొంది. ఆఫ్‌లైన్‌ వ్యాపారులకు పలు అవసరాలను ఇది తీరుస్తుందని తెలిపింది. డైనమిక్‌, స్టాటిక్‌ క్యూఆర్‌ కోడ్‌, ట్యాప్‌ అండ్‌ పే, డెబిడ్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు.. ఇలా పలు ఆప్షన్లలో చెల్లింపులను స్వీకరించేలా దీనిని డిజైన్‌ చేశారు. ‘చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు పలు అవసరాలు తీర్చేలా విస్తృత పరిష్కారాన్ని తక్కువ ఖర్చుతో ఈ డివైజ్‌ ద్వారా అందిస్తున్న’ట్లు భారత్‌పే సీఈఓ నలిన్‌ నేగి పేర్కొన్నారు.


మళ్లీ పూర్తి సామర్థ్యానికి దుబాయ్‌ విమానాశ్రయం

దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు మళ్లీ పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయని సీఈఓ గ్రిఫిత్స్‌ ప్రకటించారు. ఇటీవలి కుంభవృష్టి ఫలితంగా ఏర్పడిన భారీ వరదలతో ఈ విమానాశ్రయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడింది. గత 75 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రన్‌వే నీట మునిగింది. దీంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి విమానాశ్రయం సాధారణ స్థితికి వచ్చిందని, రోజుకు దాదాపు 1400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని గ్రిఫిత్స్‌ తెలిపారు.


సెకనుకు 10,000 లావాదేవీలు!

రాజోర్‌పే నుంచి యూపీఐ స్విచ్‌

దిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో ఫిన్‌టెక్‌ కంపెనీ రాజోర్‌పే సొంత యూపీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ‘యూపీఐ స్విచ్‌’ని ఆవిష్కరించింది. ఇది క్లౌడ్‌ ఆధారిత ఇన్నోవేషన్‌ అని, దీంతో లావాదేవీలు సులువుగా, వేగంగా జరుగుతాయని తెలిపింది. లావాదేవీ సంపూర్తిగా చేసే రేటు 4-5% మెరుగుపడుతుందని.. ఎప్పుడైనా సెకనుకు 10,000 లావాదేవీలను హ్యాండిల్‌ చేసేలా డిజైన్‌ చేసినట్లు వివరించింది. వ్యాపారులకు ఉద్దేశించిన యూపీఐ ఇన్నోవేషన్స్‌తో పోలిస్తే యూపీఐ స్విచ్‌ 5 రెట్లు వేగవంతమైనదని రాజోర్‌పే పేమెంట్స్‌ విభాగాధిపతి ఖిలన్‌ హరియా అన్నారు. రాజోర్‌పేతో మా భాగస్వామ్యం వ్యాపార చెల్లింపుల్లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పగలదని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఓఓ గణేశ్‌ అనంతనారాయణన్‌ పేర్కొన్నారు.


80% పెరిగిన సైయెంట్‌ డీఎల్‌ఎం లాభం

ఈనాడు, హైదరాబాద్‌: సైయెంట్‌ డీఎల్‌ఎం, గత ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. త్రైమాసిక ఆదాయం 30.5% పెరిగి రూ.362 కోట్లకు,  నికరలాభం 80.7% వృద్ధితో రూ.22.7 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తికాలానికి  ఆదాయం రూ.1,192 కోట్లు, నికరలాభం రూ.61.2 కోట్లుగా ఉన్నాయి. 2022-23తో పోల్చితే ఆదాయం 43.2%, నికరలాభం 92.9% పెరిగాయి.  ఏరోస్పేస్‌, రక్షణ విభాగాల్లో లభించిన పెద్ద ఆర్డర్లతో ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేయగలిగినట్లు సైయెంట్‌ డీఎల్‌ఎం  సీఈఓ ఆంథోనీ మాంటాల్బనో వివరించారు. వచ్చే రెండేళ్ల పాటు ఇదేవిధంగా అధిక వృద్ధి బాటలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.


30 నుంచి స్టెల్లాంటిస్‌ వాహన ధరలు పెంపు

దిల్లీ: సిట్రోయెన్‌ బ్రాండ్‌పై విక్రయిస్తున్న వాహన ధరలను ఈ నెల 30 నుంచి పెంచబోతున్నట్లు స్టెల్లాంటిస్‌ ఇండియా మంగళవారం వెల్లడించింది. జీప్‌ బ్రాండ్‌పై అమ్ముతున్న కంపాస్‌, మెరిడియన్‌ మోడళ్ల ధరలను 0.5% పెంచుతున్నట్లు పేర్కొంది. ముడి పదార్థాలు, కార్యకలాపాల వ్యయాలు పెరిగినందునే, వాహన ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. వివిధ మోడళ్లపై రూ.4,000-17,000 వరకు ధరల పెంపు ఉంటుందని వివరించింది. సిట్రోయెన్‌ బ్రాండ్‌పై వస్తున్న కాంపాక్ట్‌ కార్‌ సి3, ఎస్‌యూవీలు సి3 ఎయిర్‌క్రాస్‌, సి5 ఎయిర్‌క్రాస్‌, విద్యుత్‌ కారు ఇ-సి3ల ధరలు రూ.6.16-37.67 లక్షల మధ్య ఉన్నాయి. జీప్‌ కంపాస్‌లు రూ.20.69-26.19 లక్షల మధ్య, జీప్‌ మెరీడియన్‌ ధరలు రూ.33.6-36.97 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉన్నాయి.


26% తగ్గిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లాభం

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ నికర లాభం రూ.174 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.235 కోట్లతో పోలిస్తే 26% తక్కువ. ఇదే సమయంలో మొత్తం నికర ప్రీమియం ఆదాయం రూ.12,629 కోట్ల నుంచి 17% వృద్ధి చెంది రూ.14,788 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2320 కోట్ల నుంచి 10% అధికమై రూ.2,550 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.811 కోట్ల నుంచి 5% పెరిగి రూ.852 కోట్లకు చేరింది. కంపెనీ ఒక్కో షేరుపై రూ.0.60 డివిడెండ్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని