హైదరాబాద్‌లో కంట్రోల్‌ఎస్‌ మూడో డేటా సెంటర్‌

ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్‌- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌లో మూడో డేటా సెంటర్‌ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది.

Published : 25 Apr 2024 02:00 IST

‘ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌’లో త్వరలో ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్‌- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌లో మూడో డేటా సెంటర్‌ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. ఐటీ, ఆర్థిక రంగ సంస్థలకు కేంద్రస్థానంగా ఉన్న గచ్చిబౌలి ‘ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌’లో ఈ కేంద్రాన్ని  రెండు, మూడు నెలల్లో ప్రారంభిస్తామి సంస్థ తెలిపింది. దాదాపు 1.34 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల, 5 అంతస్తుల భవనంలో 13 మెగావాట్ల ఐటీ లోడ్‌ సామర్థ్యంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. 9 వరసల భద్రతా వలయం, అత్యాధునిక కూలింగ్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కనెక్ట్‌ సర్వీసెస్‌, ఇంటర్నెట్‌ ఎక్స్ఛేంజీ ప్రొవైడర్లతో అనుసంధానించి ఉండటం దీని ప్రత్యేకతలు వెల్లడించింది.

కంట్రోల్‌ఎస్‌ హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ, గచ్చిబౌలిల్లో ఇప్పటికే 2 డేటా సెంటర్లు నిర్వహిస్తోంది. ముంబయి, చెన్నై, బెంగళూరు, నోయిడాల్లోనూ కంట్రోల్‌ఎస్‌ డేటా కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 250 మెగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. పట్నా, కోల్‌కతా, లఖ్‌నవూ తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎడ్జ్‌ డేటా కేంద్రాలు నిర్వహిస్తోంది. క్లౌడ్‌ సర్వీస్‌ సంస్థలు, డిజాస్టర్‌ రికవరీ సేవలు అందించే సంస్థలు అధికంగా ఉన్నందున హైదరాబాద్‌ నగరం డేటా కేంద్రాలకు కేంద్రస్థానంగా మారుతోందని కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌ సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి తెలిపారు. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, ఇంతకు ముందు ప్రకటించిన 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో మూడో డేటా కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని