62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్‌ లాభం

ఎలక్ట్రికల్‌ స్టీల్‌ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్‌-అసెంబ్లీస్‌, డైకాస్ట్‌ రోటార్స్‌ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది.

Published : 17 May 2024 02:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎలక్ట్రికల్‌ స్టీల్‌ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్‌-అసెంబ్లీస్‌, డైకాస్ట్‌ రోటార్స్‌ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఈ సంస్థ రూ.327.88 కోట్ల ఆదాయాన్ని, రూ.40.36 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.247.50 కోట్లు, నికరలాభం రూ.24.84 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 32.48%, నికరలాభం 62.48% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.1201.60 కోట్ల ఆదాయాన్ని, రూ.90.20 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23తో పోల్చితే ఆదాయం 9.22%, నికరలాభం 53.32% పెరిగాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని షీట్‌ మెటల్‌ విభాగంలో 72.95%, మెషీన్‌ అవర్స్‌లో 90.47% వినియోగించినట్లు పిట్టీ ఇంజినీరింగ్‌ వైస్‌ఛైర్మన్‌, ఎండీ అక్షయ్‌ ఎస్‌.పిట్టీ వివరించారు. కంపెనీ చరిత్రలో అత్యధిక ఆదాయాన్ని, నికరలాభాన్ని గత ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమీక్షా త్రైమాసికంలో మహారాష్ట్ర స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ నుంచి రూ.30.45 కోట్ల రాయితీ సొమ్ము లభించినట్లు తెలిపారు.

30% డివిడెండ్‌

వాటాదార్లకు రూ.5 ముఖ విలువ కల ఒక్కో షేరుకు 30% చొప్పున (రూ.1.50) డివిడెండ్‌ చెల్లించాలని పిట్టీ ఇంజినీరింగ్‌ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

నిధుల సమీకరణ

భవిష్యత్తు విస్తరణ అవసరాల కోసం రూ.360 కోట్ల మేరకు నిధులు సమీకరించాలని పిట్టీ ఇంజినీరింగ్‌  డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టబుల్‌ వారెంట్లు/ డిబెంచర్లు జారీ చేయడం ద్వారా ఈ నిధులు సమీకరిస్తారు.

గురువారం బీఎస్‌ఈలో షేరు 2.73% నష్టపోయి, రూ.852 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 1.96% నష్టపోయి రూ.857.75 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని