వినీత్‌ నయ్యర్‌ కన్నుమూత

టెక్‌ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన వినీత్‌ నయ్యర్‌ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు.

Published : 17 May 2024 02:49 IST

దిల్లీ: టెక్‌ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన వినీత్‌ నయ్యర్‌ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. ‘భారత కార్పొరేట్‌ రంగానికి వినీత్‌ మరణం తీరని లోట’ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు. ముఖ్యంగా సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, ఆయన ధైర్యంగా ముందుండి నడిపించారని అన్నారు. టెక్‌ మహీంద్రా మాజీ ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ సంతాపం వ్యక్తం చేస్తూ.. ‘భారత్‌లోని అత్యున్నత వ్యక్తుల్లో ఒకరిని మనం కోల్పోయాం. వ్యక్తిగతంగా దశాబ్దాలుగా నన్ను నడిపించిన స్నేహితుడు దూరమయ్యారు. సోదరుడిగా, మార్గదర్శకుడిగా నన్ను నిత్యం వెన్నంటి ఉండేవారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని పేర్కొన్నారు. నయ్యర్‌ మృతిపై టెక్‌ పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ సంతాపం తెలిపింది. ‘ఆయన దార్శనికత ఐటీ పరిశ్రమపై చెరగరాని ముద్ర వేసింద’ని పేర్కొంది. ‘సంస్థలనే నిర్మించగల ఒక శక్తి నయ్యర్‌. సాహిత్యంపై, కళలపై ఆయనకు అపార ప్రేమ ఉంద’ని టెక్‌ మహీంద్రా ప్రస్తుత సీఈఓ మోహిత్‌ జోషి అన్నారు.

పలు కంపెనీల్లో..వివిధ బాధ్యతల్లో..

అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను పుంజుకునేలా చేయడం కోసం 18 నెలల పాటు ఆ సంస్థకు వైస్‌ ఛైర్మన్‌, ఎండీగా నయ్యర్‌ వ్యవహరించారు. అంతర్జాతీయ ఏజెన్సీల్లో, కార్పొరేట్‌ రంగం (ప్రభుత్వ, ప్రైవేటు)లో ఆయన 4 దశాబ్దాలకు పైగా పనిచేశారు. పదేళ్ల పాటు ప్రపంచ బ్యాంకులో బాధ్యతలు నిర్వర్తించారు. గెయిల్‌కు తొలి సీఎండీగా సేవలందించారు. హెచ్‌సీఎల్‌ టెక్‌కు వైస్‌ ఛైర్మన్‌గా, హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌కు ఎండీగా వ్యవహరించారు. టెక్‌ మహీంద్రాలో వైస్‌ ఛైర్మన్‌గానే కాకుండా.. టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌, మహీంద్రా లాజిసాఫ్ట్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌, మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, ద గ్రేట్‌ ఈస్టర్న్‌ షిప్పింగ్‌ కంపెనీ, గ్రేట్‌షిప్‌ (ఇండియా), విద్య ఇన్వెస్ట్‌మెంట్స్‌ తదితర కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని