సంక్షిప్త వార్తలు

దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్‌ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్‌ రూ.3.76 ఉన్నాయి.

Published : 19 May 2024 01:42 IST

దొడ్ల డెయిరీకి పెరిగిన లాభం

ఈనాడు, హైదరాబాద్‌: దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్‌ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్‌ రూ.3.76 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.3,125.5 కోట్ల ఆదాయం, రూ.166.7 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.27.75 ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 11.1 శాతం, నికర లాభం 36.4 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల ఆదాయాల స్థాయిని అధిగమించటాన్ని గొప్ప మైలురాయిగా భావిస్తున్నట్లు దొడ్ల డెయిరీ ఎండీ సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. పాల సేకరణ, విలువ ఆధారిత ఉత్పత్తులు, పంపిణీ కార్యకలాపాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు, దీనివల్ల లాభాలు పెరిగినట్లు వివరించారు.  


విమ్టా ల్యాబ్స్‌ లాభం రూ.12.4 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: కాంట్రాక్టు పరిశోధన, టెస్టింగ్‌ సేవలు అందించే విమ్టా ల్యాబ్స్‌ కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.80.2 కోట్ల ఆదాయాన్ని, రూ.12.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.82.5 కోట్లు, నికర లాభం     రూ.12.7 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయాలు, లాభాలు స్వల్పంగా తగ్గాయి. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విమ్టా ల్యాబ్స్‌ ఆదాయం రూ.322.3 కోట్లు కాగా, దీనిపై రూ.41 కోట్ల నికరలాభం నమోదైంది. వార్షిక ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, నికరలాభం 14.9% క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం చివర్లో తమ వ్యాపార కార్యకలాపాలు ఆకర్షణీయంగా సాగినట్లు, అంతకు ముందు ఎదురైన ఇబ్బందులను తట్టుకొని నిలిచినట్లు సంస్థ ఎండీ హరిత వాసిరెడ్డి వివరించారు.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ విలీనం

ఆమోదించిన వాటాదార్లు

దిల్లీ: ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ విలీనానికి వాటాదార్ల ఆమోదం లభించింది. షేర్‌ హోల్డర్లు, నాన్‌-కన్వర్ట్‌బుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ) హోల్డర్లు దీనికి అంగీకారం తెలిపారు. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఈ నెల 17న వాటాదార్లు, ఎన్‌సీడీ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో విలీన తీర్మానానికి అనుకూలంగా 99.95% ఓట్లు లభించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం మందుగా ఐడీఎఫ్‌సీలో ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్‌; ఆ తర్వాత ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ విలీనం అవుతాయి. ఈ విలీనం వల్ల ఐడీఎఫ్‌సీ వాటాదార్లకు ప్రతి 100 షేర్లకు, 155 ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు షేర్లు కేటాయిస్తారు. ఐసీఐసీఐ బ్యాంకులో ఐసీఐసీఐ విలీనమైనట్లుగానే ఇప్పుడు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో ఐడీఎఫ్‌సీ విలీనం అవుతుంది. తద్వారా ఒక పెద్ద ఆర్థిక సేవల సంస్థగా ఎదిగే అవకాశం దీనికి కనిపిస్తోంది.


ఎంత పెద్ద ప్రయాణమైనా సున్నా నుంచే మొదలు

అది 1969. ఆడ్రియన్‌ డాల్సీ, ల్యారీ హిల్‌బ్లోమ్, రాబర్ట్‌ లిన్‌ అనే ముగ్గురు యువకులు ఓ చిన్న కొరియర్‌ సంస్థను ప్రారంభించారు. తమ ఇంటి పేర్లలోని తొలి అక్షరాలను కలిపి ‘డీహెచ్‌ఎల్‌’ అని పేరుపెట్టారు. ఓ డొక్కు కారును నడుపుకొంటూ వెళ్తూ ఇంటింటికీ పార్సిళ్లు చేరవేసేవారు. కాలచక్రంలో 55 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ‘డీహెచ్‌ఎల్‌’ 250 సొంత విమానాలు, 32 వేల  వాహనాలతో ప్రపంచం నలుమూలలా కొరియర్‌ సేవలు అందిస్తోంది.

ఆ సంస్థలో 5.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2019 నాటికే దాని ఆదాయం రూ.6 లక్షల కోట్లు దాటింది! మీరున్న చోటునుంచే, మీకున్న వనరులతోనే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎన్ని అవాంతరాలెదురైనా ఆగిపోవద్దు. అంతా సున్నా నుంచే మొదలవుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆండ్రూ ఒనొజా, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని