సంక్షిప్త వార్తలు

ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సలహా మండలి నుంచి ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్, ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ వైదొలగనున్నారు.

Published : 20 May 2024 01:22 IST

బైజూస్‌ సలహామండలికి రజనీశ్, మోహన్‌దాస్‌ దూరం! 

బెంగళూరు: ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సలహా మండలి నుంచి ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్, ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ వైదొలగనున్నారు. కంపెనీతో వీరిద్దరి ఒప్పందం గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగియనుండగా, దీన్ని పొడిగించరాదని సంయుక్తంగా నిర్ణయించినట్లు వారు తెలిపారు. 

‘బైజూస్‌ బ్రాండ్‌పై ఎడ్‌టెక్‌ సేవలు అందిస్తున్న థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎల్‌పీఎల్‌)తో మా ఒప్పందం ఏడాది కాలపరిమితికి చేసుకున్నాం. అది పూర్తయ్యాక, ఒప్పందాన్ని పొడిగించొద్దని కంపెనీతో పాటు మేము సంయుక్తంగా నిర్ణయించాం. అధికారికంగా ఒప్పందం లేకున్నా, ఆ కంపెనీ వ్యవస్థాపకులు ఎప్పుడైనా మమ్మల్ని సలహా కోసం సంప్రదించొచ్చు. కంపెనీకి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం’ అని కుమార్, పాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్లిష్ట సమయాల్లో రజనీశ్, పాయ్‌ల సేవలు తమకు ఎంతో ఉపకరించాయని కంపెనీ ప్రశంసించింది.


సీఐఐ అధ్యక్షుడిగా సంజీవ్‌పురి 

దిల్లీ: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ పురి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2024-25 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు సీఐఐ అధ్యక్షుడిగా ఉన్న టీవీఎస్‌ సప్లై చైన్‌ ఛైర్మన్‌ ఆర్‌.దినేశ్‌ నుంచి సంజీవ్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రెసిడెంట్‌ డెజిగ్నేట్‌గా ఈవై (ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌) ఇండియా ప్రాంత ఛైర్మన్‌ రాజీవ్‌ మేమాని బాధ్యతలు చేపట్టారు. సీఐఐ జాతీయ ఉపాధ్యక్షుడిగా టాటా కెమికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ ఆర్‌.ముకుందన్‌ వ్యవహరిస్తారు. ఆయన టాటా గ్రూప్‌లో 33 ఏళ్లుగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని