ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు మరిన్ని చిక్కులు

అగ్రగామి మసాలా బ్రాండ్‌లు ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్‌ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది.

Published : 20 May 2024 01:26 IST

దిల్లీ: అగ్రగామి మసాలా బ్రాండ్‌లు ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్‌ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. ఈ సంస్థలు ఎగుమతి చేస్తున్న ఉత్పత్తుల నాణ్యతపై ముందుగా సింగపూర్, హాంకాంగ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా కూడా వీటిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో, న్యూజిలాండ్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పలు దేశాల్లో ఎండీహెచ్, ఎవరెస్ట్‌ ఉత్పత్తుల రీకాల్స్‌కు సంబంధించి తమకు సమాచారం ఉందని న్యూజిలాండ్‌ ఆహార నియంత్రణ సంస్థ తెలిపింది. ‘ఎథిలీన్‌ ఆక్సైడ్‌ రసాయనం మానవుల్లో క్యాన్సర్‌కు కారణమవుతోంది. న్యూజిలాండ్‌తో పాటు పలు దేశాల్లో వీటి వినియోగాన్ని దశలవారీగా తొలగించారు. ఎండీహెచ్, ఎవరెస్ట్‌ ఉత్పత్తుల్లో ఈ రసాయనం ఉందన్న వార్తల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాం’ అని న్యూజిలాండ్‌ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జెన్ని బిషప్‌ తెలిపారు.

  • ఏం జరిగిందంటే: భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్‌ కు చెందిన ప్రీ-ప్యాకేజ్డ్‌ స్పైస్‌ మిక్స్‌ ఉత్పత్తుల శాంపిళ్లలో, పరిమితికి మించి ‘ఎథిలీన్‌ ఆక్సైడ్‌’ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది. అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌ ఉన్నాయి. 
  • ఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన భారత నియంత్రణ సంస్థలు, మన దేశంలోని ఎండీహెచ్, ఎవరెస్ట్‌ ప్లాంట్లను తనిఖీ చేసి, ఆయా శాంపిళ్లను పరీక్షల కోసం అంతర్జాతీయ తనిఖీలకు పంపించాయి. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని