అయిదో రోజూ నిఫ్టీ జోరు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించడంతో వరుసగా అయిదో రోజూ నిఫ్టీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 267 పాయింట్లు పెరిగింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, స్థిరాస్తి షేర్లు పరుగులు తీయగా, బ్యాంకింగ్, లోహ స్క్రిప్‌లు డీలాపడ్డాయి.

Updated : 23 May 2024 02:43 IST

సమీక్ష

రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించడంతో వరుసగా అయిదో రోజూ నిఫ్టీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 267 పాయింట్లు పెరిగింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, స్థిరాస్తి షేర్లు పరుగులు తీయగా, బ్యాంకింగ్, లోహ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.29 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.84% నష్టంతో 82.18 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు నీరసంగా ట్రేడయ్యాయి.

 • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల ఎగువన ముగిసింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి మదుపర్ల సంపద రూ.415.94 లక్షల కోట్లుగా నమోదైంది. 

సెన్సెక్స్‌ ఉదయం 74,165.52 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభంలో తడబడిన సూచీ 73,860.33 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం పుంజుకుని 74,307.79 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.75 పాయింట్లు పెరిగి 22,597.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,483.15- 22,629.50 పాయింట్ల మధ్య కదలాడింది.

 • త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో భెల్‌ షేరు 5.42% నష్టపోయి రూ.301.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,023.97 కోట్లు తగ్గి రూ.1.05 లక్షల కోట్లకు చేరింది.
 • ఫలితాల ప్రభావంతో జేకే టైర్‌ షేరు 4.91% రాణించి రూ.424.15 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.517.54 కోట్లు పెరిగి రూ.11,058.59 కోట్లకు చేరింది. 
 • బలమైన ఆర్థిక ఫలితాలు, భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) షేరు ఇంట్రాడేలో రూ.359 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.04% తగ్గి రూ.341.55 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.71,213.86 కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఈ షేరు 193% దూసుకెళ్లింది.
 • వరుసగా ఆరో రోజూ హిందుస్థాన్‌ జింక్‌ షేర్లు దూసుకెళ్లాయి. బుధవారం ఇంట్రాడేలో రూ.807 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 4.13% లాభంతో రూ.772.70 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే షేరు 164% పరుగులు తీసింది. మే 14 నుంచి చూస్తే 37.96% పెరిగింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. హెచ్‌యూఎల్‌ 2.45%, రిలయన్స్‌ 1.72%, ఇన్ఫోసిస్‌ 1.43%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.26%, ఐటీసీ 1.10%, అల్ట్రాటెక్‌  0.97% రాణించాయి. ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్‌ 1.35% వరకు నష్టపోయాయి. 
 • 3 ఏళ్ల కనిష్ఠానికి బ్రిటన్‌ ద్రవ్యోల్బణం: ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్‌ ద్రవ్యోల్బణం 2.3 శాతానికి చేరింది. ఇది దాదాపు మూడేళ్ల కనిష్ఠ స్థాయి.  
 • ఈక్విటీ, రుణం ద్వారా రూ.12,000 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు ఇండియన్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 
 • ప్రైవేట్‌ పెట్టుబడిదార్ల నుంచి నిధులు సమీకరించే అవకాశం ఉందని ఓయో వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ విలువను 4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.33,000 కోట్లు)గా లెక్కకట్టారు. ఐపీఓ ప్రతిపాదనను ఓయో ప్రస్తుతానికి విరమించుకున్న సంగతి విదితమే.
 • అగ్రగామి డిబెంచర్‌ ట్రస్టీ బీకాన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈనెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.57-60 నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 2000 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాలి. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి.
 • కార్పొరేట్‌ ఏజెంట్‌గా బీమా ఉత్పత్తులను విక్రయించేందుకు ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతి లభించిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. 
 • ట్రావెల్‌ పోర్టల్‌ ఐక్సిగో, స్టీల్‌ వైర్‌ తయారీదారు బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌లను నిర్వహించే లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌కు, ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు సెబీ అనుమతి ఇచ్చింది. 

నేటి బోర్డు సమావేశాలు: ఐటీసీ, ఇండిగో, పేజ్‌ ఇండస్ట్రీస్, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, శిల్పా మెడికేర్, తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, బేయర్‌ క్రాప్‌సైన్స్, ష్నైడర్‌ ఎలక్ట్రిక్, సీఈఎస్‌సీ, సెల్లో వరల్డ్, ఫినోలెక్స్‌ కేబుల్స్, జేకే లక్ష్మీ సిమెంట్, సెంకో గోల్డ్, ఇక్రా, అమృతాంజన్‌ హెల్త్‌కేర్, జీఓసీఎల్‌ కార్పొరేషన్, ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని