73750- 74150 ఎగువన సానుకూలమే!

బలమైన దేశీయ సంకేతాలతో గతవారం సూచీలు జీవనకాల సరికొత్త గరిష్ఠాలను అధిరోహించాయి. డీఐఐ, ఎఫ్‌ఐఐ కొనుగోళ్లకు తోడు చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇందుకు దోహదపడ్డాయి.

Published : 27 May 2024 02:57 IST

సమీక్ష: బలమైన దేశీయ సంకేతాలతో గతవారం సూచీలు జీవనకాల సరికొత్త గరిష్ఠాలను అధిరోహించాయి. డీఐఐ, ఎఫ్‌ఐఐ కొనుగోళ్లకు తోడు చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇందుకు దోహదపడ్డాయి. మేలో ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ 61.7గా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరడంతో, మదుపర్ల దృష్టి పెద్ద షేర్ల వైపునకు మళ్లింది. కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు 2.2% నష్టంతో 82.1 డాలర్లకు చేరింది. అమెరికాలో నిల్వలు పెరగడం, అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలు ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.10 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ద్రవ్యోల్బణం 2 శాతానికి దిగి వచ్చే వరకు వడ్డీ రేట్ల కోత ప్రారంభించలేమని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌    1.9% లాభంతో 75,410 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.9% పెరిగి 22,957 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో యంత్ర పరికరాలు, లోహ, విద్యుత్‌ షేర్లు లాభపడగా.. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.1166 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ.6,978 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.22,047 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:10గా నమోదు కావడం..
ఎంపిక చేసిన పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, 75,636 పాయింట్ల వద్ద జీవనకాల తాజా గరిష్ఠాన్ని నమోదుచేసింది. స్వల్పకాలంలో 73,570- 74,150 పాయింట్ల ఎగువన ట్రేడైతే, ప్రస్తుత సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది. గరిష్ఠ స్థాయుల్లో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు. 

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. స్వల్పకాలంలో కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయి. మే డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో సూచీల ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. షేర్లు అధిక విలువలకు చేరడం, ఇండియా విక్స్‌ సూచీ పెరగడం ఇందుకు తోడవ్వొచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరికొంతకాలం అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండటం, అప్రమత్తతకు దారితీయొచ్చు. ఈ వారం ఎల్‌ఐసీ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ, బాటా, కమిన్స్, అపోలో హాస్పిటల్స్, ఆల్కెమ్‌ ఫార్మా, ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. త్రైమాసిక ఫలితాలు చివరి దశకు చేరడంతో, షేరు ఆధారిత కదలికలు పరిమితం కావొచ్చు. ఈ వారం 2023-24 జీడీపీ గణాంకాలు, మౌలిక రంగ వృద్ధి, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు విడుదల కానున్నాయి. అంతర్జాతీయంగా.. చైనా పారిశ్రామిక లాభాలు, యూరో ఏరియా ఎకనామిక్‌ సెంటిమెంట్‌ ఇండికేటర్, యూరో ఏరియా నిరుద్యోగ రేటు, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌లు, అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీ, యూరో ఏరియా కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్, ద్రవ్యోల్బణం, చైనా తయారీ పీఎంఐ గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. 

తక్షణ మద్దతు స్థాయులు: 74,800, 74,158, 73,762
తక్షణ నిరోధ స్థాయులు: 76,000, 76,500, 77,000
సెన్సెక్స్‌ 73750- 74150 ఎగువన సానుకూల ధోరణి కొనసాగించొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని