‘డివిడెండు’ లాభాలు కొనసాగొచ్చు

ఈ వారం సూచీలు రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండు అందనుండడంతో వచ్చిన సానుకూల వాతావరణానికి తోడు విదేశీ మదుపర్లు త్వరలోనే కొనుగోళ్లు మొదలు పెడతారన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.

Published : 27 May 2024 03:05 IST

గరిష్ఠ స్థాయుల వద్ద అప్రమత్తతకూ అవకాశం
లోహ, వాహన షేర్లు రాణించొచ్చు
యంత్ర పరికరాల స్క్రిప్‌లు ముందుకే
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

ఈ వారం సూచీలు రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండు అందనుండడంతో వచ్చిన సానుకూల వాతావరణానికి తోడు విదేశీ మదుపర్లు త్వరలోనే కొనుగోళ్లు మొదలు పెడతారన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. నిఫ్టీ-50 జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరినందున కొంత అప్రమత్తత కూడా ఉండొచ్చంటున్నారు. శనివారం వెలువడిన దివీస్‌ ఫలితాలు, ఈ వారం వెల్లడయ్యే టాటా స్టీల్‌ (బుధ), అపోలో హాస్పిటల్స్‌ (గురు) ఫలితాలను గమనించాలి. డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడుబు గురువారం ముగియనున్నందున, ఒడుదొడుకులకు అవకాశం ఉంది. మార్చి త్రైమాసిక, 2023-24 జీడీపీ గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే, విదేశీ పెట్టుబడులపై స్పష్టత వస్తుందనీ భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • సానుకూల దేశీయ, అంతర్జాతీయ సంకేతాల మధ్య లోహ తయారీ సంస్థల షేర్లు రాణించొచ్చు. ఈ రంగ షేర్లను తగ్గినపుడల్లా కొనుగోలు చేయడం మంచిదని ఓ బ్రోకరేజీ చెబుతోంది.
  • సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరినా, పెద్దగా వార్తలేమీ లేకపోవడంతో సిమెంటు రంగ షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. 
  • వాహన కంపెనీల షేర్లు సానుకూలతను కొనసాగించొచ్చు. బలమైన ఆర్థిక ఫలితాలకు తోడు 2024-25లో విక్రయాలపై సానుకూల అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు. 
  • ఐటీ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలోనే ట్రేడవవచ్చు. చాలా వరకు షేర్లు తమ మద్దతు స్థాయిలకు సమీపంలో ఉన్నందున, తక్కువ స్థాయిల నుంచి పుంజుకోవచ్చు. 
  • బలహీన సంకేతాల మధ్య ఔషధ రంగ షేర్లు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. నిఫ్టీ ఫార్మా సూచీ  19,400 నిరోధ స్థాయిని అధిగమిస్తేనే ర్యాలీకి అవకాశం ఉంది. 
  • రుతుపవనాల ప్రవేశం, కేంద్ర బడ్జెట్‌పై స్పష్టత వచ్చే వరకు ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ కంపెనీల షేర్లు  ఒక శ్రేణికే పరిమితం కావొచ్చు. 
  • చాలా వరకు యంత్రపరికరాల కంపెనీలు బలమైన ఫలితాలను ప్రకటించడంతో ఈ రంగ షేర్లు లాభాలను కొనసాగించొచ్చు. 
  • ఎన్నికల ఫలితాల ముందు ప్రభుత్వ రంగ చమురు కంపెనీల షేర్లు రాణించొచ్చు. కేంద్రం మూలధన వ్యయాలు అధికంగా చేయొచ్చన్న అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు.     
  • టెలికాంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా షేర్లు ఈ వారం రాణించొచ్చు. టాటా కమ్యూనికేషన్స్‌కు రూ.1860 వద్ద నిరోధం ఉంది. అయితే రూ.1850కి తిరిగి రాకపోవచ్చు. 
  • నిఫ్టీ బ్యాంక్‌ సూచీపై విశ్లేషకులు ‘బులిష్‌’గా ఉన్నారు. ముఖ్యంగా ఆర్‌బీఐ రూ.2.11 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి బదిలీ చేయడానికి సిద్ధం కావడం సానుకూలతలను తెచ్చిపెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లను పరిశీలించొచ్చు.

నేటి బోర్డు సమావేశాలు: ఎల్‌ఐసీ, ఎన్‌ఎండీసీ, నేషనల్‌ అల్యూమినియం, ఎన్‌ఎండీసీ స్టీల్, నాట్కో ఫార్మా, ఆస్ట్రాజెనెకా ఫార్మా, జీఎండీసీ, ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా, టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్, ఐఎఫ్‌బీ, డిష్‌ టీవీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని