ఎల్‌ఐసీ లాభం రూ.13,763 కోట్లు

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Published : 28 May 2024 02:29 IST

డివిడెండ్‌ 60%

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.13,428 కోట్లతో పోలిస్తే ఇది 2% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు చేరింది. తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.12,811 కోట్ల నుంచి రూ.13,810 కోట్లకు పెరిగింది. రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం రూ.76,009 కోట్ల నుంచి రూ.77,368 కోట్లకు వృద్ధి చెందింది. పూర్తి (2023-24) ఆర్థిక సంవత్సరానికి సంస్థ నికర లాభం రూ.40,676 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.36,397 కోట్లు మాత్రమే. 2023-24లో మొత్తం ప్రీమియం ఆదాయం రూ.4,75,070 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.4,74,005 కోట్లుగా ఉంది.

  • తుది డివిడెండ్‌ రూ.6: రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6 తుది డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది. మధ్యంతర డివిడెండ్‌ రూ.4తో కలిపి మొత్తం డివిడెండ్‌ రూ.10కు చేరింది.
  • ప్రభుత్వానికి రూ.3,662 కోట్లు: ఎల్‌ఐసీలో అతి పెద్ద వాటాదారు (96.5% వాటా)గా ఉన్న ప్రభుత్వానికి తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తో రూ.3,662 కోట్లు లభించనున్నాయి. ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 610.36 కోట్ల షేర్లు ఉన్న సంగతి తెలిసిందే.
  • పాలసీదార్లకు కేటాయించిన బోనస్‌ రూ.49,439.56 కోట్ల నుంచి రూ.52,955.87 కోట్లకు చేరింది.
  • గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత విభాగంలో 2,03,92,973 పాలసీలు విక్రయమయ్యాయి. 2022-23లో ఇవి 2,04,28,937గా నమోదయ్యాయి.
  • భారతీయ జీవిత బీమా వ్యాపారంలో ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 58.87 శాతంగా ఉంది. వీఎన్‌బీ మార్జిన్‌ 16.20% నుంచి 60 బేసిస్‌ పాయింట్లు పెరిగి 16.80 శాతానికి చేరింది.
  • సాల్వెన్సీ నిష్పత్తి 1.87% నుంచి 1.98 శాతానికి పెరిగింది.
  • కొత్త వ్యాపార విలువ (వీఎన్‌బీ) రూ.9,156 కోట్ల నుంచి 4.66% పెరిగి రూ.9,583 కోట్లకు చేరింది.
  • ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.43,97,205 కోట్ల నుంచి 16.48% పెరిగి రూ.51,21,887 కోట్లకు చేరింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ఏజెన్సీ ఫోర్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్ట్‌ సహకారంతో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తామని ఎల్‌ఐసీ ఛైర్మన్‌ సిద్ధార్థ మొహంతి ధీమా వ్యక్తం చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని