కమొడిటీ డెరివేటివ్స్‌లో అంతరాయంపై 15 నిమిషాల్లోపే సమాచారమివ్వాలి

కమొడిటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌కు అంతరాయం ఏర్పడితే 15 నిమిషాల్లోగా ఆ సమాచారం ఇవ్వాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది.

Published : 28 May 2024 02:32 IST

అప్పుడు ట్రేడింగ్‌ సమయమూ పొడిగించాలి
ఎక్స్ఛేంజీలకు సెబీ వెల్లడి

దిల్లీ: కమొడిటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌కు అంతరాయం ఏర్పడితే 15 నిమిషాల్లోగా ఆ సమాచారం ఇవ్వాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. అలాంటి సందర్భాల్లో ట్రేడింగ్‌ను 30 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను పొడిగించాలనీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిర్దిష్ట విధాన ప్రక్రియను (ఎస్‌ఓపీ) సెబీ తీసుకొచ్చింది. ట్రేడింగ్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలే స్వచ్ఛందంగా నిలిపేయడం లేదా నియంత్రణ పరమైన కారణాల రీత్యా అప్పుడప్పుడు అంతరాయాలు చోటుచేసుకుంటాయి. ఒకవేళ ఏదేని ఎక్స్ఛేంజీలో అంతరాయం ఏర్పడితే.. ఇతర ఎక్స్ఛేంజీల్లోని మార్కెట్‌ సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని సెబీ తెలిపింది. 2024 జులై 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది. 

  • ట్రేడింగ్‌కు అంతరాయం ఏర్పడిన విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీ తక్షణమే సెబీకి తెలియజేయాలి. అంతరాయం చోటుచేసుకున్న సమయం నుంచి 15 నిమిషాల్లోగా మార్కెట్‌ వర్గాలు, ట్రేడర్లకు మెసేజ్, తన వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం ఇవ్వాలి. 
  • తిరిగి ట్రేడింగ్‌ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు 45 నిమిషాలకోసారి అంతరాయానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ట్రేడింగ్‌ సమయం పొడిగింపు వివరాలను కూడా తెలియజేయాలని సెబీ తెలిపింది. డిజాస్టరీ రికవరీ సైట్‌ నుంచి లేదా ఇతరత్రా పద్ధతుల ద్వారా ట్రేడింగ్‌ కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఎక్స్ఛేంజీ ప్రయత్నించాలని పేర్కొంది. 
  • సాయంత్రం గం.5.00/రాత్రి గం.9.00ల వరకు ట్రేడ్‌ అయ్యే కాంట్రాక్టులకు సంబంధించి, మార్కెట్‌ సమయం ముగియడానికి కనీసం 30 నిమిషాల ముందు (ముందస్తు సమాచారం ఇచ్చిన 15 నిమిషాలతో కాకుండా) ట్రేడింగ్‌ను పునరుద్ధరిస్తే.. ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాల్సిన అవసరం ఉండదు. అయితే గం.4.30 లేదా గం.8.30 కల్లా ట్రేడింగ్‌ను పునరుద్ధరిస్తామంటూ గం.4:15 లేదా గం.8.15 కల్లా మార్కెట్‌ వర్గాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ట్రేడింగ్‌ సమయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ సమాచారాన్ని గం.4.45 లేదా గం.8:45కు ఇస్తే.. ట్రేడింగ్‌ సమయాన్ని గం.5.00 లేదా గం.9.00 తర్వాతి నుంచి 30 నిమిషాల పాటు ఎక్స్ఛేంజీలు పొడిగించాలి. ఒకవేళ గం.4.45 లేదా గం.8.45 కల్లా సమాచారం ఇవ్వకుంటే, ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించనక్కర్లేదు. అలాగే మార్కెట్‌ వర్గాలు, ట్రేడర్లకు ఇచ్చే సమాచారంలో మదుపర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు ఎప్పటి కల్లా లాగిన్‌ అవ్వాలనే వివరాలను పొందుపర్చాలి. 
  • రాత్రి గం.11:30 లేదా గం.11.55 వరకు ట్రేడ్‌ అయ్యే కాంట్రాక్టుల విషయంలో ట్రేడింగ్‌ పునరుద్ధరణ సమాచారాన్ని గం.10.45 లేదా 11.10 కల్లా ఇవ్వాలి. ట్రేడింగ్‌ పునఃప్రారంభ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలను 11.10 వరకు ఇవ్వొచ్చు. అప్పటివరకు సమాచారం ఇవ్వకుంటే ట్రేడింగ్‌ సమయంలో పొడిగింపు ఉండదు. ఒకవేళ సమాచారం ఇస్తే 30 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను పొడిగించవచ్చని సెబీ తెలిపింది. 
  • వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత కమొడిటీలకు ఆప్షన్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించేందుకు నిర్దేశించిన సగటు రోజువారీ టర్నోవర్‌ పరిమితిని రూ.100 కోట్లకు సెబీ తగ్గించింది. అంతకుముందు ఇది రూ.200 కోట్లుగా ఉంది. జూన్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. 

సామాజిక సేవా సంస్థలు వార్షిక ప్రభావ నివేదిక సమర్పించాలి: సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల (ఎస్‌ఎస్‌ఈలు) వద్ద నమోదైన లేదా వాటి ద్వారా నిధులు సమీకరించిన సామాజిక సేవా సంస్థలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘వార్షిక ప్రభావ నివేదిక’ను ఆయా ఎక్స్ఛేంజీలకు అక్టోబరు చివరికల్లా సమర్పించాలని సెబీ తెలిపింది. సమాజం మీద ఎంత మేర నాణ్యమైన ప్రభావాన్ని ఆ సంస్థలు సృష్టించాయో వార్షిక ప్రభావ నివేదిక ద్వారా ఎస్‌ఎస్‌ఈలు తెలుసుకుంటాయి. ఒకవేళ లాభాపేక్ష రహిత సంస్థలు (ఎన్‌పీఓ) సెక్యూరిటీల నమోదు లేకుండా కేవలం రిజిస్టర్‌ మాత్రమే అయితే.. ఎన్‌పీఓలు చేపట్టిన కార్యకలాపాలతో కూడిన వివరాలు ఆ నివేదికలో ఉండాలి. ఎస్‌ఎస్‌ఈల ద్వారా నిధులు సమీకరించిన సామాజిక సంస్థలు, ఆర్థిక సంవత్సరం ముగిశాక 90 రోజుల్లోగా వార్షిక ప్రభావ నివేదికను వెల్లడించాల్సి ఉంటుందని 2023 సెప్టెంబరులో సెబీ వెల్లడించింది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024 అక్టోబరు 31 కల్లా సమర్పించాలని సెబీ తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని