నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఫలితాలు

నాట్కో ఫార్మా అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక వార్షిక ఆదాయాన్ని, నికరలాభాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.నన్నపనేని వెల్లడించారు.

Published : 28 May 2024 02:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మా అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక వార్షిక ఆదాయాన్ని, నికరలాభాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.నన్నపనేని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఈ సంస్థ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.4,127 కోట్ల ఆదాయాన్ని, రూ.1,388 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.77.34 ఉంది. 2022-23లో ఆదాయం రూ.2,811 కోట్లు, నికరలాభం రూ. 715 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే ఆదాయం 46.8%, నికరలాభం 94.1% పెరిగాయి. దేశీయ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి దాదాపు రూ.90 కోట్లకు వన్‌టైమ్‌ ఛార్జి/ కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) చేశారు. లేని పక్షంలో ఆమేరకు నికరలాభం పెరిగేది. ఫార్మా ఫార్ములేషన్ల విభాగంలో రూ.35 కోట్లు, క్రాప్‌ హెల్త్‌ సైన్సెస్‌ (సీహెచ్‌ఎస్‌) విభాగంలో రూ.25 కోట్లు వన్‌టైమ్‌ ఛార్జి కింద కేటాయించగా, సీహెచ్‌ఎస్‌ డివిజన్‌లో రూ.30 కోట్లకు ప్రొవిజనింగ్‌ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్ములేషన్ల ఎగుమతులపై అధిక ఆదాయాలు నమోదైనట్లు వి.సి.నన్నపనేని వెల్లడించారు. క్రాప్‌ హెల్త్‌ సైన్సెస్‌ విభాగంలో రూ.108 కోట్ల ఆదాయం ఉన్నట్లు తెలిపారు.  

మార్చి త్రైమాసికంలో..: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నాట్కో ఫార్మా రూ.1,110 కోట్ల ఆదాయాన్ని, రూ.386.3 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.927 కోట్లు, నికరలాభం రూ.275.8 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే త్రైమాసిక నికరలాభం దాదాపు 40% పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మూడు దఫాలుగా కలిపి, ఒక్కో షేరుకు మొత్తం రూ.9.5 డివిడెండ్‌ చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. 

 రుణ రహిత కంపెనీ: ఏదైనా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయాలని, తద్వారా సత్వర వృద్ధి సాధించే అవకాశం కలుగుతుందని నాట్కో ఫార్మా యాజమాన్యం కొంతకాలంగా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి అప్పు లేదు. పైగా చేతిలో కొంత నగదు కూడా ఉంది. దీనికి తోడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంతో అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి బాటలో కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో అనువైన కంపెనీని కొనుగోలు చేసే కసరత్తును త్వరలో చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు