సంక్షిప్తవార్తలు(6)

ఇనుప ఖనిజం ధరలను ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఈనెల 28 నుంచి స్వల్పంగా పెంచింది. ఇనుప ఖనిజం లంప్‌ ధర టన్నుకు రూ.250, ఫైన్స్‌ ధర టన్నుకు రూ.350 చొప్పున పెరిగింది.

Published : 29 May 2024 03:17 IST

ఇనుప ఖనిజం ధరలు  పెంచిన ఎన్‌ఎండీసీ 

ఈనాడు, హైదరాబాద్‌: ఇనుప ఖనిజం ధరలను ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఈనెల 28 నుంచి స్వల్పంగా పెంచింది. ఇనుప ఖనిజం లంప్‌ ధర టన్నుకు రూ.250, ఫైన్స్‌ ధర టన్నుకు రూ.350 చొప్పున పెరిగింది. దీంతో టన్ను లంప్‌ ధర రూ.6,450, టన్ను ఫైన్స్‌ ధర రూ.5,610 పలుకుతాయి. ఇనుప ఖనిజం లంప్‌ లో దాదాపు 65.5 శాతం, ఫైన్స్‌లో 64 శాతం చొప్పున ఇనుము లభిస్తుంది. ఇటీవల కాలంలో చైనా అధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, అంతర్జాతీయ మార్కెట్లో ఇనుప ఖనిజం ధర స్వల్పంగా పెరుగుతోంది. మనదేశంలోనూ ఇనుప ఖనిజం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఎన్‌ఎండీసీ ధర పెంచినట్లు తెలుస్తోంది.

ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌కు, డిస్ట్రిబ్యూటర్‌/ స్టాకిస్ట్‌గా ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ వ్యవహరించనుంది. ఈ ప్రతిపాదనకు ఎన్‌ఎండీసీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు కృత్రిమ మేధ సహకారం
కొత్త సాంకేతికతల అభివృద్ధికి సీబీఆర్‌తో విప్రో జట్టు

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా అనాలిటిక్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే కొంత సాంకేతికతల అభివృద్ధి కోసం సెంటర్‌ ఫర్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌(సీబీఆర్‌)తో ఐటీ సేవల సంస్థ విప్రో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో భాగంగా ఉన్న సీబీఆర్‌.. స్వతంత్ర, లాభాపేక్ష రహిత పరిశోధనా సంస్థ. ఈ ఒప్పందంలో భాగంగా విప్రో పరిశోధన, అభివృద్ధి బృందం వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇది కృత్రిమ మేధను ఉపయోగించి, వ్యక్తులతో మాట్లాడుతూ గుండె, మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును నియంత్రించడం, నిర్వహణపై దృష్టి పెడుతుంది. సీబీఆర్‌ సహకారంతో డిజిటల్‌ యాప్‌ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్‌ను విప్రో పరీక్షిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలపై ఇంజిన్‌ సమర్థతకు సంబంధించి విలువైన ఆధారాలు ఈ ప్రయోగంలో వెల్లడి అవుతాయని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ‘విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్‌ బ్రెయిన్‌ సాంకేతికత పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని పేర్కొంది. 


హైదరాబాద్‌లో ఫోస్‌రాక్‌ కొత్త ప్లాంట్‌

హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఫోస్‌రాక్‌ ఇండియా, సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కెమికల్స్‌ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఫోస్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ యూకేకు అనుబంధ సంస్థగా ఫోస్‌రాక్‌ ఇండియా ఉంది. అంతర్జాతీయంగా 70 ఏళ్ల అనుభవం కలిగిన జేఎంహెచ్‌ గ్రూప్‌లో ఇది భాగం. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో వినియోగదారులకు నిర్మాణాత్మక సొల్యూషన్‌లను ఫోస్‌రాక్‌ ఇండియా అందిస్తోంది. హైదరాబాద్‌ ప్లాంట్‌ను జేఎంహెచ్‌ గ్రూప్‌నకు చెందిన డాక్టర్‌ జేమ్స్, ఫిట్రియాని హే, జేఎంహెచ్‌ గ్రూప్‌ సీఈఓ రాబ్‌ బొన్నిసి ప్రారంభించారు. వ్యాపార భాగస్వాములు, వినియోగదారులు, విక్రేతలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్‌లు ఇందులో పాల్గొన్నారు. కంపెనీకి ఇప్పటికే కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. 


బకాయిల్లో 7 శాతానికే రేడియస్‌ ఎస్టేట్‌ అప్పగింత!
అదానీ బిడ్‌ను సమర్థించిన ఎన్‌సీఎల్‌ఏటీ

దిల్లీ: దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న స్థిరాస్తి సంస్థ రేడియస్‌ ఎస్టేట్‌ కోసం అదానీగుడ్‌హోమ్స్‌ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలుపుతూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) సమర్థించింది. ఇద్దరు ఫైనాన్షియల్‌ క్రెడిటర్లు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ (సీఓసీ) ‘వాణిజ్య జ్ఞానం’తోనే నిర్ణయం తీసుకుందనీ తెలిపింది. 

93 శాతం తగ్గింపుతో: 2022 జనవరి 9న ఎన్‌సీఎల్‌టీ ముంబయి ధర్మాసనం అదానీగుడ్‌హోమ్స్‌ పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపింది. అదానీ రియల్టీకి చెందిన అదానీగుడ్‌హోమ్స్‌ ప్రతిపాదన ప్రకారం.. రేడియస్‌ ఎస్టేట్‌ నుంచి రూ.1700 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, అందులో 93% తగ్గింపు (హెయిర్‌కట్‌)తో రూ.76 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. అంటే బకాయిల్లో 7 శాతమే వసూలవుతున్నట్లు లెక్క. అయితే దాదాపు 700 ఫ్లాట్లను ఎటువంటి ధర పెంపు లేకుండా, వాటి నిర్మాణం పూర్తి చేసి యజమానులకు అప్పజెపుతుంది. ఈ ప్రతిపాదనకు సీఓసీ 83.99% ఓట్లతో అనుమతి లభించింది.


మెడ్‌ప్లస్‌కు రూ.30 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: ఫార్మసీ సేవల సంస్థ మెడ్‌ప్లస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1500.95 కోట్ల ఆదాయాన్ని. రూ.29.97 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.1266.67 కోట్లు, నికరలాభం రూ.26.52 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఈ సంస్థ రూ.5,664.86 కోట్ల ఆదాయం, రూ.65.52 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్‌ రూ.5.48 ఉంది. 2022-23లో ఆదాయం రూ.4,603.65 కోట్లు, నికరలాభం రూ.50.43 కోట్లు ఉన్నాయి. 


రూ.1,323 కోట్ల నష్టపరిహారం కోరడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు: స్పైస్‌జెట్‌

దిల్లీ: కేఏఎల్‌ ఎయిర్‌వేస్, కళానిధి మారన్‌లు తమ నుంచి రూ.1,323 కోట్లకు పైగా నష్టపరిహారం కోరడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని స్పైస్‌జెట్‌ మంగళవారం తెలిపింది. ఇటీవల దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేయడంతో పాటు స్పైస్‌జెట్, దాని అధినేత అజయ్‌ సింగ్‌ నుంచి రూ.1,323 కోట్లకు పైగా నష్టపరిహారం కోరతామని కేఏఎల్‌ ఎయిర్‌వేస్, కళానిధి మారన్‌ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌ స్పందించింది. నష్ట పరిహారం కింద రూ.1,323 కోట్లు కోరడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు స్పైస్‌జెట్‌ తెలిపింది.


రూ.10 కోట్ల నిధులు సమీకరించిన స్కిప్పీ

దిల్లీ: ఐస్‌ పాప్‌ బ్రాండ్‌ స్కిప్పీ ప్రీ-సిరీస్‌ ఎ ఫండింగ్‌లో రూ.10 కోట్ల నిధుల్ని సమీకరించినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ (హెచ్‌ఏఎన్‌), వెంచర్‌ క్యాటలిస్ట్స్‌ (వీసీఏటీ) ఈ పెట్టుబడులు పెట్టాయి. వచ్చే కొన్ని వారాల్లో మరో రూ.7 కోట్లు సమీకరించేందుకు కంపెనీ చర్చలు సాగిస్తోంది. తదుపరి దశ వృద్ధిలో భాగంగా బ్రాండ్‌ నిర్మాణం, మార్కెటింగ్, వర్కింట్‌ క్యాపిటల్‌ విస్తరణ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, కీలక పదవుల నియామకం కోసం ఈ నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రవి కబ్రా వెల్లడించారు. 2021లో ప్రారంభించిన స్కిప్పీకి దేశ వ్యాప్తంగా 20,000కు పైగా విక్రయ కేంద్రాలు ఉన్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని