సంక్షిప్తవార్తలు (4)

గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఓయో సుమారు రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Published : 31 May 2024 03:42 IST

ఓయోకు తొలిసారి వార్షిక లాభం

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఓయో సుమారు రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఓయో లాభాన్ని నమోదుచేసిన తొలి ఆర్థిక సంవత్సరం ఇదేనని పేర్కొన్నారు. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ ఎబిటా ప్లస్‌లో నమోదైందని తెలిపారు. కంపెనీ వద్ద సుమారు రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందువల్లే అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తమ రుణ రేటింగ్‌ను పెంచిందని వివరించారు. 2023-24లో ఓయో నికర లాభం రూ.99.6 కోట్లుగా నమోదయ్యింది. ఎబిటా కూడా 2022-23లోని రూ.274 కోట్ల నుంచి గణనీయంగా పెరిగి రూ.888 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా సుమారు 5,000 హోటళ్లు, 6,000 హోమ్స్‌ను సంస్థ జతచేసుకుంది. ‘మున్ముందు భారత్‌లోనే కాకుండా నార్డిక్స్, ఆగ్నేయాసియా, అమెరికా, బ్రిటన్‌ లాంటి కీలక మార్కెట్లలోనూ కంపెనీ వృద్ధిని నమోదు చేస్తుంద’ని  అగర్వాల్‌ తెలిపారు. ఆధ్యాత్మిక - వ్యాపార పర్యటనలు, సమావేశాలు, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లాంటి ధోరణులు పెరగడం వల్ల 2024-25లోనూ ఇంతకంటే ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు తగ్గిన నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.168 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఆదాయం రూ.2,570 కోట్లు ఉంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.1,997 కోట్లు, నికరనష్టం రూ.639 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయాలు పెరిగి, నష్టాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.9,207 కోట్ల ఆదాయాన్ని, రూ.829 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.7,269 కోట్లు, నికర నష్టం రూ.848 కోట్లుగా నమోదయ్యాయి.


2023-24లో రూ.27,000 కోట్ల పసిడి బాండ్ల కొనుగోలు

ముంబయి: అధిక ప్రతిఫలం లభించడానికి తోడు, పన్ను ప్రయోజనాలు ఉంటుండటంతో పసిడి బాండ్లకు మదుపర్ల నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) మదుపర్లు రూ.27,031 కోట్ల విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేశారు. 2022-23లో కొనుగోలు చేసిన రూ.6,551 కోట్ల పసిడి బాండ్ల విలువతో పోలిస్తే ఇది 4 రెట్లకు పైగా ఉంది. పరిమాణం పరంగా 2023-24లో 44.34 టన్నుల పసిడికి సమానమైన బాండ్లను కొనుగోలు చేశారు. 2022-23లో ఇది 12.26 టన్నులుగా ఉందని ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. పసిడి బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ విక్రయిస్తోంది. 2015 నవంబరులో పసిడి బాండ్ల పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటివరకు 67 విడతల్లో రూ.72,274 కోట్ల విలువైన పసిడి బాండ్లను (146.96 టన్నులకు సమానమైన) ఆర్‌బీఐ విక్రయించింది. పసిడి బాండ్లకు మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఉంది. గ్రాము పసిడి విలువకు సమానంగా పసిడి బాండు ధరను నిర్ణయిస్తున్నారు. 


బీడీఎల్‌కు ఆకర్షణీయ లాభాలు 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), మార్చి త్రైమాసికానికి రూ.942.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.288.77 కోట్లు, ఈపీఎస్‌ రూ.7.88 నమోదయ్యాయి. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.835.42 కోట్లు, నికరలాభం   రూ.152.75 కోట్లు, ఈపీఎస్‌ రూ.4.17   ఉన్నాయి. దీంతో పోల్చితే సమీక్షా త్రైమాసికంలో నికరలాభం ఆకర్షణీయంగా పెరిగింది.  గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఈ సంస్థ రూ.2,731.10 కోట్ల ఆదాయాన్ని, రూ.612.72 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.16.72 ఉంది. 2022-23లో ఆదాయం రూ.2,644 కోట్లు, నికరలాభం రూ.352.17 కోట్లు, ఈపీఎస్‌ రూ.9.61 ఉన్నాయి.  వాటాదార్లకు ఒక్కో షేరుకు 85 పైసల చొప్పున తుది డివిడెండ్‌ను బీడీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని