పర్యవేక్షణా వైఫల్యాలకు ఎంఐఐలపై జరిమానా

అసాధారణ లేదా అనుమానిత ట్రేడింగ్‌ లావాదేవీలను గుర్తించడంలో విఫలమైతే మార్కెట్‌ మౌలిక వసతుల సంస్థల (ఎంఐఐ)పై  సెబీ జరిమానా విధించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published : 07 Jun 2024 03:37 IST

జులై 1 నుంచి అమలు: సెబీ

దిల్లీ: అసాధారణ లేదా అనుమానిత ట్రేడింగ్‌ లావాదేవీలను గుర్తించడంలో విఫలమైతే మార్కెట్‌ మౌలిక వసతుల సంస్థల (ఎంఐఐ)పై  సెబీ జరిమానా విధించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్న మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించే ఈ నిర్ణయం, ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానుంది. 

  • స్టాక్‌ మార్కెట్లు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలను ఎంఐఐలుగా వ్యవహరిస్తారు. ఇవి గత ఆర్థిక సంవత్సరంలో నమోదుచేసిన వార్షికాదాయం ఆధారంగా, సంబంధిత లోపాలపై జరిమానా ఉండనుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్నిసార్లు పర్యవేక్షణా లోపాలు తలెత్తాయనే విషయాన్నీ పరిగణనలోకి తీసుకోనుంది. ‘మార్కెట్‌ సమగ్రతను దెబ్బతీసేందుకు దారితీసే అసాధారణ లేదా అనుమానిత ట్రేడింగ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించడమే ఎంఐఐల పర్యవేక్షణ వెనక ప్రధాన ఉద్దేశం.  ఎంఐఐలు అందించే ఈ సమాచారం, నియంత్రణ పరమైన చర్యలు చేపట్టే విషయంలో తమకు ఉపయోగపడుతుంద’ని సెబీ వెల్లడించింది. 

ఇలా చెల్లించాలి

  • ఒక ఎంఐఐ మొత్తం వార్షిక ఆదాయం రూ.1,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటే.. మొదటిసారి పర్యవేక్షణా వైఫల్యానికి రూ.25 లక్షలు జరిమానా విధిస్తారు. రెండో సారైతే రూ.50 లక్షలు, మూడో సారి నుంచి రూ.1 కోటి వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఎంఐఐ వార్షిక ఆదాయం రూ.300-1000 కోట్లయితే, తొలి 3 వైఫల్యాలకు వరుసగా రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షలు చొప్పున జరిమానా కట్టాలి.
  • ఎంఐఐ మొత్తం వార్షిక ఆదాయం రూ.300 కోట్ల కంటే తక్కువగా ఉంటే తొలి 3 పర్యవేక్షణా వైఫల్యాలకు ఈ జరిమానాలు వరుసగా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.4 లక్షలుగా ఉంటాయి. 
  • మార్కెట్‌ వ్యాప్తంగా ప్రభావం లేదా ఎక్కువ మంది మదుపర్లు నష్టపోయేందుకు దారితీయడం లాంటి సందర్భాల్లో ఈ జరిమానా వర్తించదు. 

మినహాయింపులు ఉంటాయ్‌

జరిమానా నుంచి మినహాయింపు పొందే అవకాశాన్ని ఎంఐఐలకు సెబీ కల్పించింది. ఇందుకోసం పర్యవేక్షణా వైఫల్యాన్ని గుర్తించిన వెంటనే సెబీకి ఆ వివరాలు సమర్పించాలి. జరిమానా విధించడానికి ముందు ఈ వివరాలను సెబీ పరిగణనలోకి తీసుకుంటుంది. 

  • సెబీ జరిమానా విధిస్తే.. ఆ మొత్తాన్ని 15 రోజుల్లోగా సెబీ మదుపర్ల భద్రత, అవగాహన నిధిలో ఎంఐఐలు జమచేయాల్సి ఉంటుంది. 
  • పర్యవేక్షణా వైఫల్యాలకు సెబీ విధించిన జరిమానా వివరాలను, ఎంఐఐలు తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. వార్షిక నివేదికలోనూ పొందుపర్చాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. 

ఏయే సందర్భాల్లో జరిమానా.. 

  • పర్యవేక్షణ కార్యకలాపాలను నిర్వర్తించే విషయంలో వైఫల్యం చెందినట్లు తేలడం
  • పర్యవేక్షణ సంబంధిత కార్యకలాపాల వివరాలను తెలియజేయకపోవడం లేదా అసమగ్రంగా ఆ వివరాలు ఉండటం
  • సరైన సమయంలో పర్యవేక్షణా చర్యలను చేపట్టకపోవడం లేదా ఆలస్యం చేయడం లేదా పాక్షికంగా చేపట్టడం

సెంట్రల్‌ కేవైసీ రికార్డ్స్‌ రిజిస్ట్రీతో కేఆర్‌ఏల వ్యవస్థలు అనుసంధానం

కేవైసీ రిజిస్ట్రేషన్‌ ఏజెన్సీలు (కేఆర్‌ఏలు) తమ వ్యవస్థలను సెంట్రల్‌ కేవైసీ రికార్డ్స్‌ రిజిస్ట్రీతో (సీకేవైసీఆర్‌ఆర్‌) అనుసంధానం చేయాల్సిందిగా సెబీ ఆదేశించింది. ఆగస్టు 1 నుంచి కేవైసీ డేటాను అప్‌లోడ్‌ చేయడాన్ని ప్రారంభించాలనీ సూచించింది. ఒక క్లయింట్‌ కేవైసీ వివరాలను మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా కేఆర్‌ఏలో అప్‌లోడ్‌ చేస్తారు. మధ్యవర్తిత్వ సంస్థలే సీకేవైసీఆర్‌ఆర్‌లోనూ కేవైసీ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేస్తుంటాయి. కేఆర్‌ఏ వ్యవస్థలో కేవైసీ సమచారాన్ని అప్‌లోడ్‌ చేయడం లేదా మార్పులు చేయడాన్ని నమోదిత మధ్యవర్తిత్వ సంస్థలు కొనసాగించొచ్చని సెబీ తెలిపింది. ఆ తర్వాత కేఆర్‌ఏలు ఆ కేవైసీ సమాచారాన్ని పరిశీలించి, ధ్రువీకరించాక మధ్యవర్తిత్వ సంస్థల నుంచి వివరాలు అందిన 7 రోజుల్లోగా సీకేవైసీఆర్‌ఆర్‌లో దానిని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి దీనిని అమలు చేయాలి. ఇప్పటికే నమోదై ఉన్న వ్యక్తులు, సంస్థల కేవైసీ వివరాలను ఆగస్టు 1 నుంచి ఆరు నెలల్లోగా సీకేవైసీఆర్‌ఆర్‌లో కేఆర్‌ఏలు అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని