గ్లాండ్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా శ్రీనివాస్‌ సాదు

ఇంజెక్టబుల్‌ ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థ గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా శ్రీనివాస్‌ సాదు నియమితులయ్యారు. ఆయన సీఈఓ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. 2019 ఏప్రిల్‌ 25 నుంచి గ్లాండ్‌ ఫార్మా ఎండీ, సీఈఓగా శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు.

Updated : 08 Jun 2024 02:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజెక్టబుల్‌ ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థ గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా శ్రీనివాస్‌ సాదు నియమితులయ్యారు. ఆయన సీఈఓ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. 2019 ఏప్రిల్‌ 25 నుంచి గ్లాండ్‌ ఫార్మా ఎండీ, సీఈఓగా శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు. ఔషధ రంగంలో ఆయనకు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. గ్లాండ్‌ ఫార్మా ప్రధానంగా కాంట్రాక్టు ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని వినియోగదార్లకు ఈ సంస్థ జనరిక్‌ ఇంజెక్టబుల్‌ ఔషధాలు, ఇతర మందులు సరఫరా చేస్తోంది. 


ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే రేట్ల కోత! 

 బ్యాంకర్లు, ఆర్థికవేత్తల అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కీలక రేట్ల కోతలు ఉండొచ్చని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వర్షపాతం సాధారణ కంటే మెరుగ్గా ఉంటుందన్న అంచనాలతో, పంటల దిగుబడి బాగుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అందువల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాలను 4.5 శాతానికి ఆర్‌బీఐ పరిమితం చేసింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందన్న అంచనాల మధ్య, ఆ నెల నుంచి 2025 మార్చిలోగా కీలక రేట్లలో రెండు సార్లు కోత ఉండొచ్చని క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త పేర్కొన్నారు. డిసెంబరు కల్లా ఆర్‌బీఐ విధానంలో మార్పు రావొచ్చని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఆర్థికవేత్త అచలా జెఠ్మలానీ అంచనా వేస్తున్నారు. అక్టోబరులో రేట్ల కోత ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ముఖ్య ఆర్థికవేత్త మదన్‌ సబ్నవీజ్‌ పేర్కొన్నారు. 

స్థిరాస్తుల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో, వడ్డీరేట్లు తగ్గితే కనుక వినియోగదార్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని, అప్పుడు స్థిరాస్తి రంగానికి బాగుంటుందని ప్రోప్‌ఈక్విటీ ఎండీ సమీర్‌ జాసుజా పేర్కొన్నారు. 


ముంబయి హై ఉత్పత్తి పెంచేందుకు సాంకేతిక తోడ్పాటు కోరనున్న ఓఎన్‌జీసీ

దిల్లీ: అరేబియా సముద్రంలో ముంబయి హై చమురు క్షేత్రం నుంచి చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంచేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి సాంకేతిక తోడ్పాటు కోరనున్నట్లు ఓఎన్‌జీసీ వెల్లడించింది. ఈ సేవలు అందించే సంస్థలను గుర్తించేందుకు అంతర్జాతీయ టెండర్‌ విడుదల చేసినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. 1976లో 48 ఏళ్ల క్రితం ముంబయి హైలో ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఉత్పత్తి చివరి దశలకు చేరుకుంది. ఇక్కడ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముంబయి హై క్షేత్రం కస్టోడియన్, ఆపరేటర్‌గా ఉన్న ఓఎన్‌జీసీ, ఉత్పత్తి పెంపు కోసం అంతర్జాతీయ సాంకేతిక సేవలు అందించే సంస్థలతో కలిసి పనిచేయనుంది. ముందుగా 10 ఏళ్ల కాంట్రాక్ట్‌ ఇచ్చి, అనంతరం మరో అయిదేళ్లు పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. ముంబయి తీరానికి 160 కిలోమీటర్ల దూరంలో ముంబయి హై క్షేత్రం ఉంది. దేశీయ చమురు ఉత్పత్తిలో దీని వాటా 38 శాతం. 


టీసీఎస్‌ ‘విజ్డమ్‌ నెక్స్ట్‌’జెన్‌ ఏఐ ప్లాట్‌పామ్‌

దిల్లీ: జెన్‌ కృత్రిమమేధ (జెన్‌ ఏఐ) ప్లాట్‌ఫామ్‌ ‘విజ్డమ్‌ నెక్స్ట్‌’ను ప్రారంభించినట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వెల్లడించింది. పలు జెన్‌ ఏఐ సాంకేతికతలను ఈ ప్లాట్‌ఫామ్‌ ఒకటే ఇంటర్‌ఫేస్‌ ద్వారా అందిస్తుంది. తక్కువ వ్యయంతో జెన్‌ ఏఐ సాంకేతికతను కంపెనీలు వేగంగా అందిపుచ్చుకునేందుకు, నియంత్రణ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది దోహదం చేస్తుందని టీసీఎస్‌ పేర్కొంది. ‘వ్యాపారంలో వినూత్నత, సామర్థ్యం, పోటీతత్వం తదితర విషయాల్లో జెన్‌ ఏఐ సాంకేతికత ద్వారా కలిగే ప్రయోజనాలను మా వినియోగదార్లు అందిపుచ్చుకునేందుకు టీసీఎస్‌ ఏఐ విజ్డమ్‌ నెక్స్ట్‌ ఉపయోగపడుతుంద’ని టీసీఎస్‌కు చెందిన ఏఐ.క్లౌడ్‌ యూనిట్‌ హెడ్‌ శివ గణేశన్‌ తెలిపారు. వ్యాపార సొల్యూషన్ల అభివృద్ధి విషయంలో వినియోగదార్లు ఎదుర్కొంటున్న అవరోధాలను తొలగించేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు వెల్లడించారు.


అమెజాన్‌ చేతికి ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఆస్తులు!  

రూ.650- 830 కోట్లతో కొనుగోలుకు ఒప్పందం

దిల్లీ: టైమ్స్‌ ఇంటర్నెట్‌కు చెందిన వీడియో ప్లేయర్, ఎడిటింగ్‌ యాప్‌ ఎంఎక్స్‌ ప్లేయర్స్‌కు చెందిన కొన్ని ఆస్తులను అమెరికా సాంకేతిక దిగ్గజం అమెజాన్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ లావాదేవీ విలువను 8-10 కోట్ల డాలర్లు (రూ.650- 850 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. సిమిలర్‌వెబ్‌ గణాంకాల ప్రకారం.. వీడియో ప్లేయర్, ఎడిటర్స్‌ యాప్‌ విభాగంలో, అగ్రగామి తొలి మూడు స్థానాల్లో ఒకటిగా ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఉంది. భారత్‌లో అత్యధికంగా వాడుతున్న 50 ఆండ్రాయిడ్‌ యాప్‌ల్లోనూ ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఒకటి. ఎంఎక్స్‌ ప్లేయర్‌ను 2018లో టైమ్స్‌ ఇంటర్నెట్‌ 14 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,200 కోట్ల) కొనుగోలు చేసింది. ఎంఎక్స్‌ ప్లేయర్‌కు చెందిన కొన్ని ఆస్తుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్‌ అధికారులు ధ్రువీకరించారు. ఈ లావాదేవీ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. ఈ కొనుగోలు పూర్తయ్యాక.. ఎంఎక్స్‌ ప్లేయర్‌కు చెందిన కొందరు ఉన్నతాధికారులు అమెజాన్‌లో చేరతారని ఆ వర్గాలు చెబుతున్నాయి. 


డాక్టర్‌ రెడ్డీస్‌ ఏపీఐ ప్లాంట్‌కు 4 అభ్యంతరాలు 

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఉన్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, ఏపీఐ తయారీ ప్లాంట్‌ (సీటీఓ-6)లో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ జీఎంపీ తనిఖీలు పూర్తిచేసింది. అనంతరం నాలుగు అభ్యంతరాలతో ఫారం 483 జారీ చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ శుక్రవారం వెల్లడించింది. ఈ తనిఖీలను 2024 మే 30 నుంచి జూన్‌ 7 మధ్య నిర్వహించారు. నిర్దేశిత సమయంలోగా ఈ అభ్యంతరాలపై సమాధానం ఇస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.

  • బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌లో 1.08% వాటాను రూ.485 కోట్లకు ప్రమోటర్‌ సంస్థ ఏపీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విక్రయించింది. దీంతో కంపెనీలో ఏపీఎల్‌ ఇన్‌ఫ్రా వాటా 27.69% నుంచి 26.61 శాతానికి చేరింది. శుక్రవారం ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ షేరు 2.69% లాభంతో రూ.1,614.35 వద్ద ముగిసింది.
  • జీఎన్‌ఎస్‌ఎస్‌ (శాటిలైట్‌) ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూళ్ల వ్యవస్థను అమలు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాల్సిందిగా కంపెనీలను ఎన్‌హెచ్‌ఏఐ ఆహ్వానించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని