సంక్షిప్త వార్తలు

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.4,000 కోట్ల వరకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది.

Published : 09 Jun 2024 03:14 IST

రూ.7,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ యత్నాలు

దిల్లీ: బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.4,000 కోట్ల వరకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది. మరో రూ.3,000 కోట్ల విలువైన షేర్లను మాతృసంస్థ బజాజ్‌ ఫైనాన్స్, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనుంది. 2025 సెప్టెంబరు కల్లా అప్పర్‌ లేయర్‌ బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాలన్న ఆర్‌బీఐ నిబంధనను పాటించడం కోసమే, బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వాటా విక్రయానికి పూనుకుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ భవిష్యత్‌ మూలధన అవసరాల కోసం వినియోగించనున్నారు. కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ ఇండియా, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, గోల్డ్‌మాన్‌ శాక్స్‌(ఇండియా) సెక్యూరిటీస్, జేఎమ్‌ ఫైనాన్షియల్‌లు ఇష్యూకు మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. 


పొగాకు తయారీదార్ల కోసం జీఎస్‌టీ ప్రత్యేక ఫారం

దిల్లీ: పాన్‌ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదార్లు ఉత్పత్తి, సరఫరా వివరాలను పన్ను అధికారులతో పంచుకునేందుకు ప్రత్యేక ఫారం ‘జీఎస్‌టీ ఎస్‌ఆర్‌ఎం-2’ను జీఎస్‌టీ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌) తీసుకొచ్చింది. పన్ను ఎగవేతలను నియంత్రించడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ తరహా ఉత్పత్తుల తయారీదార్లు, యంత్ర సామగ్రి వివరాల నమోదు చేసే నిమిత్తం గత నెలలోనే జీఎస్‌టీ ఎస్‌ఆర్‌ఎం-1 ఫారంను జీఎస్‌టీఎన్‌ తీసుకు రావడం గమనార్హం. తాజాగా తెచ్చిన రెండో ఫారం కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంది. పాన్‌ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదార్లు ఆ  నెలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరా, వినియోగ వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని జీఎస్‌టీఎన్‌ వెల్లడించింది. పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకు రావడమే ఈ కొత్త ఫారం ఉద్దేశంగా కనిపిస్తోందని మూరే సింగి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రజత్‌ మోహన్‌ తెలిపారు.


విమాన టికెట్‌ ధరలు 9% పెరిగాయ్‌ 

జనవరి-మార్చిపై ఎఫ్‌సీఎమ్‌ ట్రావెల్‌ 

ముంబయి: ఈ ఏడాది తొలి మూడు నెల (జనవరి-మార్చి)ల్లో భారత్‌లో విమాన టికెట్ల ధరలు సగటున 9% పెరిగాయని ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ నమోదిత ఎఫ్‌సీఎమ్‌ ట్రావెల్‌ వెల్లడించింది. ఆర్థిక వృద్ధి వల్ల ప్రయాణ గిరాకీ పెరగడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. 2023 ఇదే మూడు నెలలతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో ప్రీమియం క్లాస్‌ బుకింగ్స్‌లో 20% వృద్ధి కనిపించింది. ఇందుకు తయారీ, ఐటీ తదితర రంగాలు సహకరించాయి. దేశీయ విమాన సామర్థ్యం 3% కంటే ఎక్కువ పెరిగింది. వ్యాపార సంబంధిత ప్రయాణాల్లో దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ, బెంగళూరు-ముంబయి మార్గాలు ముందు స్థానాల్లో నిలిచాయి. వ్యాపార ప్రయాణికులు ప్రీమియం అనుభవం కోసం కాస్త ఎక్కువ ఖర్చుపెట్టడానికీ సిద్ధపడుతున్నారు. వ్యాపార ప్రయాణాల్లో వృద్ధి కారణంగా, భారత్‌ త్వరలోనే ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద వ్యాపార ప్రయాణ మార్కెట్‌గా నిలుస్తుందని అంచనా వేసింది. భారత విమానయాన రంగం రాణిస్తుండడంతో, అంతర్జాతీయ విమాన సామర్థ్యం కూడా 14% మేర పెరిగింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా, టికెట్‌ సగటు ధరలు కొంత తగ్గడమూ ఇందుకు దోహదం చేసిందని చెప్పాలి.


ఫిన్‌టెక్‌ రంగంలో ఎస్‌ఆర్‌ఓల ఏర్పాటుకు మార్గదర్శకాలు

ముంబయి: ఫిన్‌టెక్‌ పరిశ్రమలో స్వయం నియంత్రిత సంస్థ (ఎస్‌ఆర్‌ఓ)ల ఏర్పాటు నిమిత్తం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తుది మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్‌బీఐ పర్యవేక్షణలో పనిచేస్తూ ఎస్‌ఆర్‌ఓ-ఎఫ్‌టీ (ఫిన్‌టెక్‌)లు ఈ రంగంలో ఆరోగ్యకర, స్థిరమైన అభివృద్ధి దిశగా బాధ్యతాయుతంగా, విశ్వసనీయతతో పనిచేయగలవని తెలిపింది. ఎస్‌ఆర్‌ఓ సభ్యులన్నీ వివాదాలకు అధికారిక మధ్యవర్తిగా ఉంటాయి. ఏ ఒక్క సంస్థకూ ఎస్‌ఆర్‌ఓలో 10% కంటే ఎక్కువ వాటా ఉండరాదు. ఎస్‌ఆర్‌ఓకు దరఖాస్తు చేయాలంటే కనీసం రూ.2 కోట్ల నికర సంపద ఉండాలి. భారత్‌లోనే ఇవి నమోదు కావాలి. కానీ విదేశీ ఫిన్‌టెక్‌ సంస్థలను అవి సభ్యులుగా చేసుకోవచ్చు. ఫిన్‌ టెక్‌ రంగానికి ప్రమాణాల నిర్దేశం, పర్యవేక్షణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, అభివృద్ధి కార్యకలాపాల బాధ్యతలను ఎస్‌ఆర్‌ఓ-ఎఫ్‌టీ తీసుకుంటాయి. ఆర్‌బీఐ కింద పనిచేస్తూ బలమైన పాలనా ప్రమాణాలను ఎస్‌ఆర్‌ఓలు పాటించాల్సి ఉంటుంది. అవసరమైతే ఎస్‌ఆర్‌ఓ ఎఫ్‌టీ బోర్డుల్లో పరిశీలకులను ఆర్‌బీఐ నియమిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని