74,400-74,900 పైన సానుకూలతలు!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, జీవనకాల తాజా గరిష్ఠాల వద్ద ముగిశాయి.

Published : 10 Jun 2024 02:05 IST

సమీక్ష: సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, జీవనకాల తాజా గరిష్ఠాల వద్ద ముగిశాయి. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి సీట్లు తగ్గడం, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టనుండటం ప్రభావం చూపాయి. అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరలు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. దేశీయంగా చూస్తే.. మేలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తయారీ పీఎంఐ 57.5కు చేరింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వరుసగా ఎనిమిదో సారి కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. 2024-25 వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచింది. బ్యారెల్‌ ముడిచమురు 2.5% నష్టంతో 79.6 డాలర్ల వద్ద ముగిసింది. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి కోతలను నిలిపివేయడానికి ఒపెక్‌ సభ్యులు మొగ్గుచూపడం కారణమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.40 దగ్గర స్థిరపడింది. అంతర్జాతీయంగా.. అమెరికాలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గింది. ఐరోపా కేంద్ర బ్యాంక్‌ అయిదేళ్లలో తొలిసారిగా వడ్డీ రేట్ల కోత విధించింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 3.7% లాభంతో 76,693 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 3.5% తగ్గి 23,290 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన లాభపడగా.. యంత్ర పరికరాలు, విద్యుత్, చమురు-గ్యాస్‌ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.13,718 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు) రూ.5,578 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 11:4గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం 76,795 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్, లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో సూచీ 74,400- 74,900 పాయింట్ల ఎగువన కొనసాగినంత వరకు, సానుకూలంగానే ట్రేడయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఒడుదొడుకుల కారణంగా గరిష్ఠ స్థాయుల్లో కొంత స్థిరీకరణకు ఆస్కారం లేకపోలేదు. 

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికలు, ఆర్‌బీఐ సమావేశం ముగియడంతో ఒడుదొడుకులు కొంతమేర సద్దుమణగొచ్చు. ఈ వారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం కీలకం కానుంది. ఫెడ్‌ ఈసారి కూడా రేట్లలో మార్పులు చేయకపోవచ్చు కానీ భవిష్యత్‌ వ్యాఖ్యల ప్రభావం చూపొచ్చు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు, చేపట్టబోయే సంస్కరణలకు సంబంధించిన వార్తలపై కన్నేయొచ్చు. రుతుపవనాల పురోగతి కూడా కీలకం కానుంది. ఇప్పటివరకు వర్షపాతం ఆశాజనకంగా ఉండటం గ్రామీణ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి, మే ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. కార్పొరేట్‌ వార్తలు, వార్షిక సాధారణ సమావేశాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. అంతర్జాతీయంగా.. అమెరికా నాన్‌ ఫారం పేరోల్స్, నిరుద్యోగం, కన్జూమర్‌ ప్రైస్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు, చైనా ద్రవ్యోల్బణం, జపాన్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు విడుదల కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 75,678, 74,941, 74,474
తక్షణ నిరోధ స్థాయులు: 77,400, 78,200, 79,000

సెన్సెక్స్‌ 74,400-74,900 ఎగువన సానుకూలతలు కొనసాగించొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని