నామినీ లేకున్నా పాత డీమ్యాట్‌ ఖాతా కొనసాగుతుంది

నామినీ పేరును సమర్పించని వారి డీమ్యాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోలను స్తంభింపచేయాలన్న నిబంధనను సడలిస్తూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది.

Published : 11 Jun 2024 01:52 IST

ఫండ్‌ పెట్టుబడులకూ ఇబ్బంది లేదు
నిబంధనలను సవరించిన సెబీ

దిల్లీ: నామినీ పేరును సమర్పించని వారి డీమ్యాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోలను స్తంభింపచేయాలన్న నిబంధనను సడలిస్తూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన నిబంధనల మేరకు ఈ నెల 30 లోపు డీమ్యాట్‌ ఖాతాదారులు, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారులు నామినీ పేరును పేర్కొనడం లేదా, నామినీ అవసరం లేదు (ఆప్ట్‌ ఔట్‌ ఆఫ్‌ నామినేషన్‌).. ఇందులో ఏదో ఒకటి తెలియజేయాల్సి ఉంది. ఇలా పేర్కొనని ఖాతాలను నిలిపివేయాలని సెబీ గతంలో పేర్కొంది.  ఈ నిబంధనను మరోసారి పరిశీలించాలని మార్కెట్‌ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న సెబీ తన పాత ఆదేశాన్ని సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్‌ ఖాతాదారులు, ఫండ్‌ మదుపరులు నామినేషన్‌ వివరాలు తెలియజేయకున్నా, వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని పేర్కొంటూ సోమవారం తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు , భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్‌తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది. ఇప్పటికే చెల్లింపులను నిలిపివేస్తే వాటిని చెల్లించాలని తెలిపింది.

కొత్తవారు తప్పనిసరిగా..: కొత్తగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించేవారు, ఫండ్లలో మదుపు చేసే వారు నామినీ పేరును వెల్లడించడం లేదా నామినేషన్‌ అవసరం లేదనే విషయాన్ని తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖాతాలు, ఫండ్‌ పెట్టుబడులకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అక్టోబరు 1 నుంచి సంస్థలు తమ వెబ్‌సైట్లు, మెబైల్‌ యాప్‌లలో నామినేషన్‌ పేర్కొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సెబీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని