సంక్షిప్త వార్తలు(6)

ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్‌ జనరల్‌గా జ్యోతి విజ్‌ను నియమించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఫిక్కీ మంగళవారం వెల్లడించింది.

Published : 12 Jun 2024 01:36 IST

ఫిక్కీ డైరెక్టర్‌ జనరల్‌గా జ్యోతి 

దిల్లీ: ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్‌ జనరల్‌గా జ్యోతి విజ్‌ను నియమించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఫిక్కీ మంగళవారం వెల్లడించింది. శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి 1988లో జ్యోతి డిగ్రీ పూర్తి చేశారు. 1990లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్‌ ఎకనామిక్స్‌లో పీజీ చేశారు. 1993లో ఫిక్కీలో చేరిన ఆమె వివిధ హోదాల్లో సేవలు అందించారు. ‘జ్యోతిని డైరెక్టర్‌ జనరల్‌గా నియమించినందుకు ఆనందంగా ఉంది. విధానాల రూపకల్పనలో ఆమె బలం, నాయకత్వం, సంస్థలో సుదీర్ఘ అనుభవం ఫిక్కీకి అదనపు విలువ జోడించడంలో సాయపడతాయ’ని ఫిక్కీ అధ్యక్షుడు అనీశ్‌ షా వెల్లడించారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ శైలేష్‌ పాఠక్‌ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఫిక్కీకి అందించిన సేవలకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.


కోయ్‌ ఛైర్‌పర్సన్‌గా అభిజిత్‌ కిశోర్‌

దిల్లీ: సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కోయ్‌) ఛైర్‌పర్సన్‌గా వొడాఫోన్‌ ఐడియా సీఓఓ అభిజిత్‌ కిశోర్‌ నియమితులయ్యారు. భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్‌ రాహుల్‌ వాట్స్‌ను వైస్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు కోయ్‌ తెలిపింది. ఈ నెల నుంచే ఈ నియామకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు కోయ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ కె మిత్తల్‌ నుంచి అభిజిత్‌ బాధ్యతలు స్వీకరించారు. 


హైదరాబాద్‌లో ఓపెన్‌టెక్స్ట్‌ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక సేవలను అందించే ఓపెన్‌టెక్స్ట్‌ హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయంగా తమ కంపెనీ కృత్రిమ మేధ ఆవిష్కరణలకు ఈ కేంద్రం తోడ్పడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముహి మాజ్‌జౌబ్‌ తెలిపారు. ఈ కొత్త కేంద్రంతో ఉద్యోగుల సంఖ్య 25% వరకు పెరుగుతుందన్నారు. 


మ్యాట్రిక్స్‌ ఫార్మాకు కోటక్‌ రూ.1445 కోట్లు

ముంబయి: హైదరాబాద్‌కు చెందిన మ్యాట్రిక్స్‌ ఫార్మాలో ఈక్విటీ, రుణం రూపేణ రూ.1445 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కోటక్‌ ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజర్స్‌ లిమిటెడ్‌ మంగళవారం ప్రకటించింది. యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రేడియెంట్‌ (ఏపీఐ) సంస్థ వయాట్రిస్‌ను కొనుగోలు చేయడంతో, దేశీయంగా ఏపీఐ విభాగంలో రెండో అతిపెద్ద సంస్థగా మ్యాట్రిక్స్‌ అవతరించింది. యాంటీ రెట్రోవైరల్‌ (ఏఆర్‌వీ) ఏపీఐల తయారీలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థగా నిలిచింది. ఈ లావాదేవీ కోసమూ కోటక్‌ నిధులు ఉపకరించాయి. పరిశోధన-అభివృద్ధిలో కూడా మ్యాట్రిక్స్‌ బలోపేతం అయ్యేందుకు ఈ పెట్టుబడి సహకరించనుంది. ఇప్పటికే 185 మంది శాస్త్రవేత్తలు, 600 డీఎంఎఫ్‌ (డ్రగ్‌ మాస్టర్‌ ఫైల్‌)ను సంస్థ కలిగి ఉంది. అమెరికా, ఐరోపా నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, అంతర్జాతీయ ఔషధ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే వీలు మ్యాట్రిక్స్‌కు కలగనుంది. 


ఇండిగోలో 1.99% వాటా రూ.3367 కోట్లకు విక్రయం 

విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో 1.99% వాటాకు సమానమైన షేర్లను, ఆ సంస్థ ప్రమోటర్‌ రాహుల్‌ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సుమారు రూ.3,367 కోట్లకు మంగళవారం విక్రయించింది. బీఎస్‌ఈలో లభ్యమవుతున్న బల్క్‌ డీల్‌ సమాచారం ప్రకారం.. ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మొత్తం 77,19,573 షేర్లను రూ.4362.04 సగటు ధరకు విక్రయించింది. అంటే లావాదేవీ మొత్తం విలువ రూ.3367.31 కోట్లు అవుతుంది. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో ప్రస్తుతం ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు 37.75% వాటా ఉంది. తాజా వాటా విక్రయానంతరం ఇది 35.76 శాతానికి తగ్గింది. సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ మారిషస్‌ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో 0.81% వాటాకు సమానమైన 31.23 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. 


సాధారణ బీమాకు మాస్టర్‌ సర్క్యులర్‌ 

దిల్లీ: ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ సాధారణ బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించడానికి వీల్లేదని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) మంగళవారం బీమా సంస్థలకు స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలను పాలసీ ఇచ్చేప్పుడే తీసుకోవాలని, మాస్టర్‌ సర్క్యులర్‌లో ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఇంతకుముందటి 13 సర్క్యులర్లను రద్దు చేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌కు అవసరమైన సంబంధిత పత్రాలను మాత్రమే సమర్పించమని వినియోగదార్లను సాధారణ బీమా కంపెనీలు కోరవచ్చని సూచించింది. రిటైల్‌ ఖాతాదార్లు తమ పాలసీని బీమా సంస్థకు సమాచారమిచ్చి, ఏ సమయంలోనైనా రద్దు చేసుకోవచ్చని పేర్కొంది. బీమా సంస్థ మాత్రం మోసం జరిగిందని చూపిస్తేనే పాలసీని రద్దు చేసుకోవచ్చని వెల్లడించింది. గడువు తీరని పాలసీని రద్దు చేసుకుంటే, ప్రీమియంలో కొంత మొత్తాన్ని బీమా సంస్థ సదరు పాలసీదారుడికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు