విశాల్‌ గోయెల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ఎస్‌బీఐకి అనుమతినిచ్చిన ఎన్‌సీఎల్‌టీ

శిల్పి కేబుల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌కు ఇచ్చిన రుణాలకు, వ్యక్తిగత హామీదారుగా ఉన్న విశాల్‌ గోయెల్‌పై వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతి లభించింది.

Published : 12 Jun 2024 02:50 IST

దిల్లీ: శిల్పి కేబుల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌కు ఇచ్చిన రుణాలకు, వ్యక్తిగత హామీదారుగా ఉన్న విశాల్‌ గోయెల్‌పై వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతి లభించింది. 2021 జూన్‌ 30 నాటికి గోయెల్‌ బ్యాంకుకు వడ్డీ, జరిమానా సహా రూ.308 కోట్ల మేరకు బాకీ ఉన్నారు. ఈ మొత్తం వసూలుకు, పరిష్కార ప్రక్రియ ప్రారంభించేందుకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) దిల్లీ బెంచ్‌ అంగీకారం తెలిపింది. దివాలా స్మృతి 2016లోని సెక్షన్‌ 100 (1) నిబంధనల ప్రకారం గోయెల్‌పై పరిష్కార ప్రక్రియ చేపట్టొచ్చని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్‌ 101 ప్రకారం గోయెల్‌పై తాజాగా మారటోరియం విధించాలని సూచించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా రుణదాతల కన్సార్షియం నుంచి శిల్పి కేబుల్‌ రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించకపోవడంతో, 2017లో సంస్థపై ట్రైబ్యునల్‌ దివాలా విచారణ ప్రారంభించింది. 2019లో శిల్పి కేబుల్‌ లిక్విడేషన్‌లోకి వెళ్లింది. స్టేట్‌ బ్యాంక్‌కు చెల్లించాల్సిన రుణం ఇంకా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గోయెల్‌ నుంచి బ్యాంకు వ్యక్తిగత హామీ తీసుకుంది. కానీ, ఆయన ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో బ్యాంకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని