ఐటీ, స్థిరాస్తి షేర్లు పడేశాయ్‌

Eenadu icon
By Business News Desk Updated : 29 Oct 2025 03:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఎఫ్‌ఐఐ కొనుగోళ్లు: రూ.10,339.80 కోట్లు
డీఐఐ కొనుగోళ్లు: రూ.1,081.55 కోట్లు

ఆసియా మార్కెట్ల బలహీన ధోరణితో మన సూచీలూ డీలాపడ్డాయి. ఐటీ, స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లలో లాభాల స్వీకరణ కూడా ప్రభావం చూపింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 10 పైసలు నష్టపోయి 88.29 వద్ద స్థిరపడింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర 1.78% తగ్గి 64.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్‌ సూచీలు ప్రతికూలంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి.

  • బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.81,000 కోట్లు తగ్గి, రూ.471.11 లక్షల కోట్ల (5.34 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 84,625.71 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,778.84) ప్రతికూలంగా ప్రారంభమైంది. ఒక దశలో 84,986.94 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో 84,219.39 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 150.68 పాయింట్ల నష్టంతో 84,628.16 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 29.85 పాయింట్లు కోల్పోయి 25,936.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 26,041.70-25,810.05 పాయింట్ల మధ్య కదలాడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టపోయాయి. ట్రెంట్‌ 1.54%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.32%, టెక్‌ మహీంద్రా   1.07%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.05%, ఎం అండ్‌ ఎం   0.98%, పవర్‌గ్రిడ్‌ 0.93%, టీసీఎస్‌ 0.90%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.87%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.80%, ఎన్‌టీపీసీ 0.80% చొప్పున తగ్గాయి. టాటా స్టీల్‌ 2.97%, ఎల్‌ అండ్‌ టీ 1.23%, ఎస్‌బీఐ 0.76%, కోటక్‌ బ్యాంక్‌   0.54%, ఎయిర్‌టెల్‌ 0.45% మేర లాభపడ్డాయి. 
  • రంగాల వారీ సూచీలకొస్తే స్థిరాస్తి, యుటిలిటీస్, బీఎస్‌ఈ ఫోకస్డ్‌ ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు, ఐటీ రంగాలు డీలా పడ్డాయి. లోహ, కమొడిటీస్, పారిశ్రామిక, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 1,801 షేర్లు సానుకూలంగా, 2,359 షేర్లు ప్రతికూలంగా కదలాడాయి. 172 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

వాధవాన్‌ పోర్ట్‌ ప్రాజెక్టుల్లో అదానీ గ్రూప్‌ భాగం

ప్రభుత్వ ఆధీనంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ (జేఎన్‌పీఏ), ముంబయి సమీపంలో  అరేబియా సముద్రంలో చేపడుతున్న వాధవాన్‌ పోర్ట్‌ ప్రాజెక్టుల్లో భాగమయ్యేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. రూ.53,000 కోట్లతో ఇక్కడ ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాధవాన్‌ పోర్ట్‌లో రూ.26,500 కోట్ల ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుల్లో, రూ.26,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్న కంటెయినర్‌ టెర్మినల్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

ఎంసీఎక్స్‌లో సాంకేతిక లోపం

మల్టీ-కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ట్రేడింగ్‌ 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కార్యకలాపాలు డిజాస్టర్‌ రికవరీ సైట్‌ ద్వారా నిర్వహించారు. సాంకేతిక లోపం వల్ల ట్రేడింగ్‌ కార్యకలాపాలు మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రారంభించామని.. అంతరాయాలపై విచారణకు ఆదేశించామని ఎంసీఎక్స్‌ నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది.

సంక్షిప్తంగా..

  • వినియోగదారు అనుభవాన్ని మెరుగుపర్చడానికి, విలాస వాహన బ్రాండ్‌ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను దేశ వ్యాప్తంగా డిజిటలీకరించడానికి మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా, జోహో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ‘స్కైలైన్‌’ పేరుతో డీలర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీఎంఎస్‌)ను ఏర్పాటు చేసి వికేంద్రీకృత డీలర్‌ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించాయి. బుకింగ్, డిజిటల్‌ చెక్‌-ఇన్, నైపుణ్య టెక్నిషియన్‌ను కేటాయించడం, ఫైనల్‌ డెలివరీ సేవలను రియల్‌-టైమ్‌ డేటా ఇంటిగ్రేషన్‌తో అందించనున్నాయి.
  • చమురు, సహజ వాయువు బ్లాక్‌ వేలం కింద బిడ్లు సమర్పించడానికి గడువును ప్రభుత్వం రెండోసారి పొడిగించింది. దీంతో మరి కొందరు సత్తా ఉన్న పెట్టుబడిదార్లు ఈ వేలంలో పాల్గొనడానికి సమయం లభించిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) తెలిపింది. 10వ విడత ఓపెన్‌ ఎకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ-ఎక్స్‌)కి బిడ్లు దాఖలు చేసేందుకు 2025 డిసెంబరు 31 వరకు గడువు పెంచినట్లు పేర్కొంది.
  • ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) రైట్స్‌ ఇష్యూ కోసం బుధవారం  అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహించేందుకు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) మంగళవారం అనుమతి ఇచ్చింది. గ్లాస్‌ ట్రస్ట్‌ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తును చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది.
  • నిబంధనలకు అనుగుణంగా లేదన్న కారణం చూపి తమ యూనివర్సల్‌ బ్యాంక్‌ దరఖాస్తును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెనక్కి పంపిందని జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తెలిపింది.  
  • అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్‌ మార్కెట్‌ విలువ కూడా తొలిసారిగా 4 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా సంస్థల మార్కెట్‌ విలువ ఈ ఘనతను సాధించాయి.

Tags :
Published : 29 Oct 2025 02:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని