మారుతీ సుజుకీ లాభం రూ.3,349 కోట్లు

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ), సెప్టెంబరు త్రైమాసికంలో రూ.3,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. 2024-25 ఇదే కాల లాభం రూ.3,102.5 కోట్లతో పోలిస్తే ఇది 8% అధికం. బలమైన ఎగుమతుల వృద్ధి ఇందుకు కలిసివచ్చింది. కార్యకలాపాల ఆదాయం  రూ.37,449.2 కోట్ల నుంచి రూ.42,344.2 కోట్లకు చేరుకుంది. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.33,879.1 కోట్ల నుంచి రూ.39,018.4 కోట్లకు పెరిగాయి.

సమీక్షా త్రైమాసికంలో కంపెనీ దేశీయ టోకు అమ్మకాలు 5.1% తగ్గి 4,40,387కు చేరుకున్నాయి. జీఎస్‌టీ రేట్ల కోత అంచనాల నేపథ్యంలో, చాలా మంది వినియోగదార్లు కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం ఇందుకు నేపథ్యం. సెప్టెంబరు 22 నుంచి జీఎస్‌టీ 2.0 అమలైన సంగతి తెలిసిందే.  ఎగుమతులు మాత్రం 42.2% వృద్ధి చెంది 1,10,487కు చేరాయి. దీంతో మొత్తం అమ్మకాలు 1.7% పెరిగి 5,50,874 యూనిట్లకు చేరుకున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో నికర విక్రయాలు అత్యధికంగా రూ.40,135.9 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది.

అర్ధ సంవత్సరానికి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో మొత్తం 10,78,735 వాహనాలను మారుతీ విక్రయించింది. అర్ధ సంవత్సర ఎగుమతులు (2,07,459) జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరడం విశేషం. దీంతో కంపెనీ నికర అమ్మకాలు అత్యధిక స్థాయిలో రూ.76,760.6 కోట్లకు చేరుకున్నాయి. 2024-25 తొలి ఆరు నెలల్లో నికర విక్రయాలు రూ.69,464.4 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో నికర లాభం రూ.6,719.1 కోట్ల నుంచి రూ.7,004.8 కోట్లకు చేరుకుంది. 

అయిదో ప్లాంటుపై కొద్ది నెలల్లో నిర్ణయం 

జీఎస్‌టీ రేట్ల కోత వల్ల చిన్న కార్ల అమ్మకాలు పుంజుకున్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. అందువల్లే కార్ల తయారీదార్లు, చిన్న కార్ల అంశంలో పునరాలోచిస్తున్నట్లు వివరించారు. వినియోగదార్లు చిన్న కార్ల నుంచి ఎస్‌యూవీలకు మళ్లుతున్నారని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలో అయిదో తయారీ ప్లాంటు ఏర్పాటు ప్రకటనను  కొద్ది నెలల్లో వెలువరచనున్నట్లు భార్గవ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల కోత ప్రభావం నేపథ్యంలో 2030-31 ఉత్పత్తి, అమ్మకాల అంచనాలను కంపెనీ సవరిస్తుందని అన్నారు. 18% జీఎస్‌టీ విభాగంలో మా రిటెయిల్‌ అమ్మకాలు 30%, పెద్ద కార్ల విక్రయాలు 4-5% పెరిగాయన్నారు. 40% జీఎస్‌టీ విభాగ అమ్మకాలతో పోలిస్తే 18% జీఎస్‌టీ విభాగంలోని కార్లే ఎక్కువ వేగంగా అమ్మకాలు సాధిస్తాయని భార్గవ అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని