Gold rate: భారీగా దిగి వచ్చిన బంగారం

అమెరికాలో ఎన్నికలు ముగిసే వరకు వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు ఏర్పడటంతో, అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు నెమ్మదించాయి.

Updated : 24 May 2024 07:23 IST

ఈనాడు వాణిజ్య విభాగం: అమెరికాలో ఎన్నికలు ముగిసే వరకు వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు ఏర్పడటంతో, అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు నెమ్మదించాయి. ఫలితంగా జీవనకాల గరిష్ఠాలను తాకిన ధరలు, అంతే వేగంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర గురువారం 2340 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ ధర గత సోమవారం 2423 డాలర్లుగా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో గరిష్ఠంగా 2449 డాలర్లకు కూడా చేరింది. అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తున్నందున, దేశీయ విపణిలో పసిడి, వెండి ధరలు పతనమవుతున్నాయి. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం రాత్రి 11 గంటల సమయానికి రూ.74,400 వద్ద కదలాడుతోంది. గత సోమవారం ఈ ధర రూ.76,750గా ఉంది. అంటే రూ.2250 తగ్గింది. ఇటీవలి గరిష్ఠ ధర రూ77,150 పలికింది. అదే విధంగా వెండి కిలో ధర రూ.92,000 స్థాయికి దిగి వచ్చింది. సోమవారం ఈ ధర రూ.96,000 స్థాయిలో ఉంది. అంటే రూ.4,000 తగ్గింది. ఈక్విటీ మార్కెట్లలోకి మదుపర్ల నిధులు ఇలానే కొనసాగితే, బంగారం 10 గ్రాముల ధర రూ.73,000 స్థాయికి, వెండి కిలో రూ.86,000 స్థాయికి దిగి రావచ్చని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని