Health insurance new rule: 3 గంటల్లో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌.. IRDAI కొత్త రూల్స్‌

ఆరోగ్య బీమా విషయంలో ఐఆర్‌డీఏఐ కొత్త రూల్స్‌ జారీ చేసింది. మూడు గంటల్లో తుది సెటిల్‌మెంట్ చేయాలని బీమా సంస్థలకు సూచించింది.

Published : 30 May 2024 00:11 IST

Health insurance | దిల్లీ: ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత కొన్నిసార్లు ఆరోగ్య బీమా సంస్థ  (Health insurance) నుంచి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పూర్తి కాకపోవడం వల్ల డిశ్చార్జి ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. ఒక్కోసారి బీమా సంస్థల జాప్యం వల్ల ఆ పూట అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులకు త్వరలో చెక్‌ పడనుంది. డిశ్చార్జి అభ్యర్థన వచ్చిన మూడు గంటల్లోనే సదరు బీమా సంస్థలు అనుమతి మంజూరుచేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పలు మార్పులతో బీమా నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) మాస్టర్‌ సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దో, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్ల వద్దో ఆలస్యం కారణంగా పాలసీదారులు, వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిశ్చార్జి అవ్వడానికి ఒక్కోసారి 10-12 గంటల పాటు వేచిచూడాల్సి వస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని ఐఆర్‌డీఏఐ ఈ సర్క్యులర్‌ విడుదల చేసింది. దీనిప్రకారం డిశ్చార్జి అభ్యర్థన వచ్చిన మూడు గంటల్లోనే ఫైనల్‌ ఆథరైజేషన్‌ ఇవ్వాల్సిఉంటుందని ఐఆర్‌డీఏ తెలిపింది. డిశ్చార్జి కోసం ఏ ఒక్క పాలసీదారుడూ వేచి చూడకూడదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఒకవేళ మూడు గంటల కంటే ఎక్కువసేపు వెయిట్‌ చేయించాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును బీమా సంస్థ తన సొంత సొమ్ము చెల్లించాలి.

క్యాష్‌లెస్‌ చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్‌లను నూరు శాతం నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. అత్యవసర సమయాల్లో క్యాష్‌లెస్‌ ఆథరైజేషన్‌ రిక్వెస్టులను గంటలోపే పరిష్కరించాలంది. ఒకవేళ చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే.. అటువంటి అభ్యర్థనలను తక్షణమే సెటిల్ చేయాలని సూచించింది. ఆస్పత్రి నుంచి వెంటనే భౌతిక కాయాన్ని పంపించే ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు జులై 31లోపు అన్ని ఇన్సూరెన్స్‌ సంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. అవసరమైతే క్యాష్‌లెస్‌ రిక్వెస్టుల పరిష్కారానికి ఆస్పత్రుల్లో ఫిజికల్‌గా హెల్ప్‌ డెస్కులను ఏర్పాటుచేసుకోవచ్చని పేర్కొంది. పాలసీదారులు డిజిటల్‌ మోడ్‌లో ప్రీ ఆథరైజేషన్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటూ కల్పించాలంది. పాలసీదారుల సాధికారత కల్పించేందుకు ఈ మాస్టర్‌ సర్క్యులర్‌ జారీ చేసినట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఆరోగ్య బీమా రంగంపై విశ్వాసాన్ని, పారదర్శకతను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని తన ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని