Indian Economy: 4 లక్షల కోట్ల డాలర్ల భారత్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్‌) సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌ అంచనా వేశారు.

Updated : 17 May 2024 04:29 IST

ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాకారం
జపాన్‌ను వచ్చే ఏడాది అధిగమిస్తుంది
ఈఏసీ-పీఎమ్‌ సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌  

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్‌) సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పేర్కొన్నారు. ఎగుమతుల వృద్ధికి సవాళ్లు ఎదురవుతున్నా, మనదేశం 7% వృద్ధి రేటు సాధించడాన్ని ప్రస్తావించారు.

రెండేళ్లలో జర్మనీని సైతం: ‘ప్రస్తుతం భారత్‌ 3.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు  రూ. 307 లక్షల కోట్ల) పరిమాణంతో అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉంది. 4.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.340 లక్షల కోట్ల)తో జపాన్‌ మనకంటే కాస్త ముందుంది. కాబట్టి ఈ ఏడాది, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మనం ఆ దేశాన్ని అధిగమిస్తామ’ని సన్యాల్‌ అన్నారు. ఇక జర్మనీ 4.6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.382 లక్షల కోట్ల) స్థాయిలో ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దగా వృద్ధి చెందడం లేదు కాబట్టి రెండేళ్ల అనంతరం ఆ దేశాన్నీ అధిగమిస్తామ’ని సన్యాల్‌ అంచనా వేశారు. ‘ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని 8-9 శాతానికి చేర్చేందుకు కావాల్సిన ద్రవ్య చర్యలు తీసుకోకపోవడమే మంచిది. దీర్ఘకాలంలో 7% వృద్ధే మంచిది. అదే ఉద్యోగాలను, పన్ను ఆదాయాన్ని సృష్టించగలద’ని సన్యాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 7 శాతంగా ఏడీబీ, ఫిచ్‌ రేటింగ్స్‌; 6.8 శాతంగా ఐఎమ్‌ఎఫ్‌, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని