iPhones: గత నెలలో భారత్‌ నుంచి రూ.10 వేల కోట్ల ఐఫోన్ల ఎగుమతి

iPhones: చైనా వెలుపల తయారీ, సరఫరాను విస్తరించాలనుకుంటున్న యాపిల్‌ అందుకనుగుణంగానే భారత్‌లో కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. మే నెలలో నమోదైన ఐఫోన్ల ఎగుమతులే అందుకు నిదర్శనం.

Updated : 19 Jun 2023 15:43 IST

దిల్లీ: మే నెలలో భారత్‌ నుంచి రూ.12,000 కోట్ల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లు (Smartphones) ఎగుమతి అయ్యాయి. వీటిలో ఐఫోన్ల (iPhones) వాటానే రూ.10 వేల కోట్లు కావడం గమనార్హం. ‘ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్ (ICEA)’ వివరాల ప్రకారం.. 2022-23లో భారత్‌ నుంచి ఐదు బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఐఫోన్లు (iPhones) ఎగుమతి అయ్యాయి. భారత్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి బ్రాండ్‌ ఇదే కావడం గమనార్హం.

ICEA గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఐఫోన్‌ (iPhones) ఎగుమతుల విలువ దాదాపు రూ.20 వేల కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే సమయంలో యాపిల్‌ భారత్‌ నుంచి రూ.9,066 కోట్లు విలువ చేసే ఐఫోన్లను విదేశాలకు సరఫరా చేసింది. ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్ల (smartphones)లో 80 శాతం ఐఫోన్లే కావడం గమనార్హం. మిగిలిన 20 శాతంలో శామ్‌సంగ్‌ సహా ఇతర బ్రాండ్లు ఉన్నాయి.

యాపిల్‌ (Apple) తమ తయారీ, సరఫరా వ్యవస్థలను చైనా వెలుపల విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే భారత్‌ నుంచి ఆశించిన స్థాయిలో తయారీ, ఎగుమతులు పుంజుకుంటున్నాయి. ఎయిర్‌పాడ్లను కూడా యాపిల్ భారత్‌లోనే తయారు చేయాలని భావిస్తోంది. గతవారం వెలువడిన ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’ నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తయారీ అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని (PLI)’ ఆసరాగా చేసుకొని యాపిల్‌ భారత్‌లో ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. 2024- 25 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఐఫోన్లలో 18 శాతం భారత్‌ నుంచే చేపట్టాలని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని