Satellite data plans: త్వరలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు.. ₹800కే అపరిమిత డేటా!

Eenadu icon
By Business News Team Published : 24 May 2025 13:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Satellite data plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌తో పాటు ఇతర కంపెనీలు ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే, తొలి దశలో యూజర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే డేటా సేవలను ఆయా కంపెనీలు అందించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నెలకు 10 డాలర్ల కంటే తక్కువ అంటే రూ.840లోపే ఈ ప్లాన్‌ ధరలు ఉండొచ్చని చెబుతున్నారు. ఆ ధరకే అపరిమిత డేటా అందించే అవకాశం ఉందని ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పేర్కొంది.

తొలుత ఆయా కంపెనీలు తమ యూజర్‌ బేస్‌ను పెంచుకోవడంపై దృష్టిసారించే అవకాశం ఉంది. 10 మిలియన్‌ కస్టమర్లను చేరుకోవడం ద్వారా స్పెక్ట్రమ్‌ కాస్ట్‌ను భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించి ఒక్కో అర్బన్‌ యూజర్‌ నుంచి రూ.500 చొప్పున ఫీజు వసూలుచేయాలని ట్రాయ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సాధారణ సర్వీసులతో పోలిస్తే ఈ మొత్తం చాలా అధికం. దీనికితోడు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంలో 4 శాతం లెవీగా చెల్లించాలని ట్రాయ్‌ పేర్కొంది. MHz స్పెక్ట్రానికి ఏడాదికి కనీసం రూ.3500 వార్షిక ఫీజును ట్రాయ్‌ ప్రతిపాదించింది. దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

ఈ స్థాయిలో లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ ఛార్జీలు ఉన్నప్పటికీ వినియోగదారులను పెంచుకునేందుకు తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు దేశీయంగా సర్వీసులు ప్రారంభించడానికి స్టార్‌ లింక్‌కు టెలికాం విభాగం నుంచి అనుమతులు లభించాయి. ఇంకా ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (IN-SPACe) ఆమోదం తెలపాల్సి ఉంది. స్టార్‌లింక్‌తో పాటు యూటెల్సాట్ వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కూడా డాట్‌ నుంచి అనుమతులు పొందినా ఇన్‌-స్పేస్‌ నుంచి తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ అనుమతులు లభిస్తే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు త్వరలోనే పౌరులకు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని