iPhones: 25% టారిఫ్‌ విధించినా.. భారత్‌లో ‘యాపిల్’ చౌకగానే..!

Eenadu icon
By Business News Team Updated : 24 May 2025 11:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

iPhones | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో ఐఫోన్లు తయారుచేయని పక్షంలో, యాపిల్‌ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి యాపిల్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే.  అయితే అగ్రరాజ్యం సుంకం విధించినప్పటికీ మన దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (GTRI) తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో తక్కువ ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది.

జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్‌ ఖర్చు సుమారు 30 డాలర్లు కాగా, అమెరికాలో 390 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. దీని కారణంగా భారత్‌లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండటమే. దేశంలో ఒక కార్మికుడికి నెల సంపాదన సగటున 230 డాలర్లు (రూ.19,000). అదే అమెరికాలో కనీస వేతన చట్టాల కారణంగా ఈ సంపాదన 2,900 డాలర్ల (రూ.2.4 లక్షలు) వరకు ఉంటుంది. అంటే దాదాపు 13 రెట్ల వ్యత్యాసం. దీనికితోడు భారత ప్రభుత్వం అందించే పీఎల్‌ఐ పథకం కూడా యాపిల్‌కు అదనపు లాభాల్ని అందిస్తోంది. దీంతో  ఐఫోన్ల ఉత్పత్తిపై 25 శాతం సుంకం విధించినా భారత్‌లో చౌకగానే తయారవుతాయని నివేదిక తెలుపుతోంది.

ఐఫోన్లను 12కు పైగా దేశాలు కలిపి తయారుచేస్తాయి. యాపిల్‌ తన బ్రాండ్‌, సాఫ్ట్‌వేర్‌, డిజైన్‌లతో ఒక్కో ఐఫోన్‌పై 450 డాలర్ల లాభం ఆర్జిస్తుంది. ఇక అమెరికాలో ఐఫోన్లను తయారుచేస్తే.. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా రిటైల్‌ ధరలు పెంచకపోతే యాపిల్‌ లాభం 450 డాలర్ల నుంచి 60 డాలర్లకు పడిపోవచ్చని పేర్కొంది. భారత్‌లో ఐఫోన్ల తయారీకి అమెరికా విధించే సుంకాల ముప్పు ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని జీటీఆర్‌ఐ నివేదిక స్పష్టం చేసింది.

Tags :
Published : 24 May 2025 10:55 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు