Banking data: మన సమాచారం సురక్షితమేనా?

దేశంలో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్‌ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి.

Updated : 19 May 2024 11:02 IST

ఖాతాదారుల్లో పెరుగుతున్న సందేహాలు
కోటక్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యం
సాంకేతికత మెరుగుదలపై బ్యాంకుల దృష్టి
వినియోగదారుల భద్రతకు పెద్దపీట
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్‌ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. కేవైసీ, ఇ-కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి)ని అమలు చేసేందుకు తగిన చర్యలూ తీసుకుంటున్నాయి. ఖాతాదారులకు సురక్షిత బ్యాంకింగ్‌ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఐటీ వ్యవస్థ లోపాలను కారణంగా చూపిస్తూ  కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై ఆర్‌బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఖాతాదారులు తమ సమాచారం క్షేమంగానే ఉందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులూ తమ సాంకేతిక (ఐటీ) వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. 

వివరాలు బయటికెళ్లాయా.. అంతే!

బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. ఖాతాల్లోని సొమ్మును ఇట్టే కాజేస్తారు. బ్యాంకులు వినియోగిస్తున్న సాంకేతికతలో ఏ చిన్న లోపం ఉన్నా, సైబర్‌ నేరగాళ్లకు పని మరింత సులువవుతోంది. ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2023 (డీపీడీపీ) ప్రకారం ప్రతి బ్యాంకు, ఆర్థిక సంస్థ తమ వినియోగదారుల సమాచారాన్ని అవసరమైనంత మేరకే వినియోగించాలి. ఆ సమాచారాన్ని అత్యంత భద్రతతో దాచి పెట్టాలి.

మార్కెటింగ్‌ కోసం వాడొద్దు

బ్యాంకులు కేవైసీ సందర్భంలో వినియోగదారుల వివరాలను ఖాతా నిర్వహణకు అవసరమైన మేరకే తీసుకోవాలని, అందుకే వినియోగించాలని చట్టం చెబుతోంది. మార్కెటింగ్‌ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఇటీవలి ఒక నివేదిక ప్రకారం కొన్ని బ్యాంకులు ఈ సమాచారాన్ని ఇతర ఆర్థిక ఉత్పత్తులు అమ్మేందుకు వాడుకుంటున్నాయని తేలింది.  

సైబర్‌ దాడుల నుంచి రక్షణ కోసం..

కేవైసీ కోసం వినియోగదారులు ఇచ్చిన సమాచారాన్ని రక్షించేందుకు, అధునాతన సైబర్‌ సెక్యూరిటీ పరిష్కారాలను వినియోగిస్తాయి. ఎప్పటికప్పుడు తమ ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేస్తుంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు బ్యాంకుల నుంచి సమాచారం బయటకు వెళ్లిన సందర్భాలు కనిపిస్తూనే ఉంటాయి. దీని విషయంలోనూ ఇప్పుడు బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా కొత్త ఖాతాదారులను చేర్చుకునేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.

ముందు జాగ్రత్తగా..

బ్యాంకు వ్యవస్థల్లో ఏమైనా లోపాలు బయటపడి, ఆర్‌బీఐ నుంచి కఠిన ఆంక్షలను ఎదుర్కోవడం బ్యాంకులకు పెద్ద సవాలు. ఖాతాదారుల విశ్వాసాన్ని కోల్పోతే కష్టం. దీన్ని అరికట్టేందుకు ఆర్థిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు తన సాంకేతిక, సైబర్‌ సెక్యూరిటీ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. 2019లో నిర్వహణ ఖర్చు నుంచి 5.6 శాతాన్ని ఇందుకోసం కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతానికి పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పెరుగుతున్న ఖాతాదారులు, సాంకేతిక అభివృద్ధికి తగ్గట్లుగా తన ఐటీ మౌలిక వసతులను పటిష్ఠం చేస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వనరులను కేటాయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంకు నిర్వహణ వ్యయాల్లో 9.3 శాతాన్ని ఐటీ, డిజిటల్‌ లావాదేవీల కోసం ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వరకు ఐటీ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని యూకో బ్యాంకు ప్రణాళికలు వేసుకుంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఐటీ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిర్వహణ వ్యయాల్లో 8-10% కేటాయిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఐటీ, డిజిటల్‌ వసతులను అభివృద్ధి చేసేందుకు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని