LIC: అదానీ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులు.. 59% పెరిగిన విలువ

LIC: హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో కుంగిన అదానీ షేర్లు.. గత ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకున్నాయి. దీంతో ఆ గ్రూప్‌ నమోదిత కంపెనీల్లోని ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ సైతం గణనీయంగా పుంజుకోవడం గమనార్హం.

Updated : 14 Apr 2024 20:27 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఆఫ్‌ ఇండియా’కు అదానీ గ్రూప్‌లో (Adani Group) ఉన్న పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో 59 శాతం పుంజుకుంది. అమెరికన్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌ నమోదిత కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఫలితంగా ఎల్‌ఐసీ రాబడి సైతం అదే స్థాయిలో కుంగింది. ఎట్టకేలకు ఆయా కంపెనీల షేర్లు తిరిగి పుంజుకోవటంతో ఎల్‌ఐసీ పెట్టుబడులకు 2023-24లో మంచి ప్రతిఫలాలు దక్కాయి.

అదానీ గ్రూప్‌ సంస్థల్లో ఎల్‌ఐసీ (LIC) పెట్టుబడుల విలువ 2023 మార్చి 31 నాటికి రూ.38,471 కోట్లుగా ఉంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి అది రూ.61,210 కోట్లకు పెరిగింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌పై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిపిందే. దీంతో ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఎల్‌ఐసీ నిర్ణయంపైనా అనేక అనుమానాలు తలెత్తాయి. ఫలితంగా పలు నియంత్రణా సంస్థలు దీనిపై తనిఖీలు నిర్వహించాయి.

తీవ్ర విమర్శల నేపథ్యంలో అదానీ గ్రూప్‌నకు (Adani Group) చెందిన రెండు కీలక కంపెనీలైన అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి ఎల్‌ఐసీ కొంతమేర పెట్టుబడులను తగ్గించుకుంది. ఆ రెండు కంపెనీల షేర్లు వరుసగా గత ఆర్థిక సంవత్సరంలో 83 శాతం, 68.4 శాతం పుంజుకోవడం గమనార్హం. అయినప్పటికీ.. మిగిలిన సంస్థల్లోని ఎల్‌ఐసీ పెట్టుబడులు 59 శాతం పుంజుకుంది. మరోవైపు అదానీ షేర్లు కుంగిన సమయంలో విదేశీ ఇన్వెస్టర్లయిన ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అబుదాబి ఐహెచ్‌సీ, ఫ్రాన్స్‌ టోటల్‌ఎనర్జీస్‌, అమెరికా జీక్యూజీ ఇన్వెస్ట్‌మెంట్‌ కలిపి దాదాపు రూ.45,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లోని ఎల్‌ఐసీ (LIC) పెట్టుబడుల విలువ వార్షిక ప్రాతిపదికన రూ.8,495.31 కోట్ల నుంచి రూ.14,305 కోట్లకు చేరింది. అదానీ పోర్ట్స్‌ విషయంలో ఈ మొత్తం రూ.12,450.09 కోట్ల నుంచి రూ.22,776.89 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్‌ విలువ ఏడాదిలోనే రెండింతలు పెరిగి రూ.3,937.62 కోట్లకు ఎగబాకింది. ఇదే తరహాలో అదానీ టోటల్‌ గ్యాస్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ పెట్టుబడులు సైతం పుంజుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని