Charlie Munger: వారెన్‌ బఫెట్‌ సక్సెస్‌ చిరునామా చార్లీ ముంగర్‌ ఇకలేరు

Charlie Munger: సుదీర్ఘ కాలం బెర్క్‌షైర్‌ హాత్‌వే వైస్‌ ఛైర్మన్‌గా పనిచేసిన చార్లీ ముంగర్‌ మంగళవారం తుది శ్వాస విడిచారు. ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్‌ బఫెట్‌ సక్సెస్‌లో ముంగర్‌ది కీలక పాత్ర.

Published : 29 Nov 2023 11:40 IST

కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్‌ బఫెట్‌ (Warren Buffet) తన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వేను స్థాపించడంలో కీలకంగా వ్యవహరించిన చార్లీ ముంగర్‌ (Charlie Munger) (99) కన్నుమూశారు. కాలిఫోర్నియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ముంగర్‌ (Charlie Munger) దశాబ్దాల పాటు బెర్క్‌షైర్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. బఫెట్‌ (Warren Buffet) తీసుకునే ప్రతి పెట్టుబడి, వ్యాపార నిర్ణయాల్లో ఆయనదే కీలక పాత్ర ఉండేది. బెర్క్‌షైర్‌ విషయంలో బఫెట్‌ను ముందుంచి వెనకాల మొత్తం ముంగరే నడిపించేవారని సన్నిహితులు చెబుతుంటారు. కానీ, కంపెనీ సక్సెస్‌లో నా పాత్రేమీ లేదని ఆయన చెబుతుండేవారు. బఫెట్‌ (Warren Buffet) మాత్రం ముంగర్‌కే క్రెడిట్‌ ఇచ్చేవారు. మానవ నైజం, వ్యాపారాలకు విలువివ్వడం గురించి ముంగర్‌ (Charlie Munger) తనకు చాలా నేర్పారని బఫెట్‌ ఓ సందర్భంలో స్వయంగా తెలిపారు. 

బఫెట్‌, ముంగర్‌ (Charlie Munger) 1500 మైళ్ల దూరంలో నివసించేవారు. కానీ, తన ప్రతి కీలక నిర్ణయం ముంగర్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకున్నానని బఫెట్‌ (Warren Buffet) వెల్లడించారు. ప్రస్తుతం బఫెట్‌ నివాసం ఉంటున్న ఒమాహాలోనే ఇద్దరి చిన్నతనం గడవడం గమనార్హం. కానీ, ముంగర్‌ ఏడేళ్లు పెద్దవాడు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఉండేది కాదని బఫెట్‌ తెలిపారు. అయితే, ఇద్దరూ బఫెట్‌ (Warren Buffet) తాత నడిపే నిత్యావసర సరకుల స్టోర్‌లోనే పనిచేశారు. అయినప్పటికీ.. ఇద్దరి మధ్య చిన్నతనంలో పెద్దగా పరిచయం లేదట.

ముంగర్‌, బఫెట్‌ తొలిసారి 1959లో ఒమాహాలో జరిగిన ఓ విందులో కలిశారు. అప్పటికే ముంగర్‌ (Charlie Munger) న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. బఫెట్‌ (Warren Buffet) ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థను నడుపుతున్నారు. నాటి నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. సుదీర్ఘ లేఖలు, తరచూ టెలిఫోన్‌ కాల్స్‌తో తమ ఆలోచనలను పంచుకునేవాళ్లమని ముంగర్‌ తన బయోగ్రఫీలో పేర్కొన్నారు. అలా 1960, 70ల్లో ఇరువురూ కలిసి కొన్ని కంపెనీలను కొనుగోలు చేశారు. అలా ట్రేడింగ్‌ స్టాంప్‌ల తయారీ సంస్థ ‘బ్లూ చిప్‌ స్టాంప్‌ కంపెనీ’లో వీరిద్దరూ అతిపెద్ద వాటాదారులుగా మారారు. తర్వాత ‘సీస్‌ క్యాండీ’, ‘బఫెల్లో న్యూస్‌ అండ్‌ వెస్కో’ను కొనుగోలు చేశారు. ముంగర్‌ 1978లో బెర్క్‌షైర్‌ వైస్‌ ఛైర్మన్‌గా మారారు. 1984లో వెస్కో ఫైనాన్షియల్‌ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు.

బెర్క్‌షైర్‌ హాత్‌వే వార్షిక సమావేశాల్లో బఫెట్‌ పక్కన కూర్చొని వాటాదారుల ప్రశ్నలకు ముంగర్‌ (Charlie Munger) సమాధానాలు ఇచ్చేవారు. కంపెనీ సమావేశాల్లో బఫెట్‌ (Warren Buffet) ఇచ్చే వివరణాత్మక సమాధానాలను ముంగర్‌ సావధానంగా వినేవారని సన్నిహితులు చెబుతుంటారు. అంతా అయిపోయిన తర్వాత ముంగర్‌ అభిప్రాయాన్ని కోరితే.. ‘ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏం లేదు’ అని అనేవారట. అయితే, అవసరమైనప్పుడు మాత్రం సూటిగా సమాధానాలిచ్చేందుకు వెనుకాడేవారు కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ముంగర్‌ (Charlie Munger) విపరీతంగా చదివేవారు. మానవ నైజాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన చాలా ఆసక్తి చూపేవారు. సైకాలజీ, భౌతిక శాస్త్రం, గణితం ఇలా అనేక రంగాల నుంచి వివిధ మోడల్స్‌ను అధ్యయనం చేసి వాటిని పెట్టుబడి నిర్ణయాల్లో ఉపయోగించేవారు. 1940లో మిషిగన్‌ యూనివర్శిటీలో గణితంలో బ్యాచిలర్‌ డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీ ఎయిర్‌ కోర్‌లో వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. తిరిగి 1948లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు.

ముంగర్‌ (Charlie Munger) సంపద ఓ దశలో రెండు బిలియన్ డాలర్లకు చేరింది. కానీ, ఆయన క్రమంగా దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించడం ప్రారంభించడంతో అది తగ్గుతూ వచ్చింది. హార్వర్డ్‌ వెస్ట్‌లేక్‌ స్కూల్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ లా స్కూల్‌, మిషిగన్‌ యూనివర్శిటీ, హంటిగ్టన్‌ లైబ్రరీకి ఆయన పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2010లో ఆయన భార్య మరణించిన తర్వాత బెర్క్‌షైర్‌ స్టాక్‌లోని మెజారిటీ వాటాను ఆయన తన ఎనిమిది మంది పిల్లలకు పంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు