New Tax Regime: కొత్త ఆదాయపు పన్ను విధానంపై తప్పుడు సమాచారం.. కేంద్రం క్లారిటీ!

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు వస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది.

Updated : 01 Apr 2024 10:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం (Old Financial Year) కాల పరిమితి ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం (New Financial Year) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Union Finance Ministry) దృష్టికి వచ్చింది. ఈ మేరకు కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ పలు కీలకాంశాలను ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో పేర్కొంది.  

ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న అంశాలు ఇవే..

  • 01.04.2024 నుంచి పన్ను విధానంలో కొత్తగా మారేదీ ఏదీ లేదు. 
  • ప్రస్తుత పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్‌ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టారు. 
  • 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. 
  • కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్‌ (స్టాండర్డ్‌ డిడక్షన్‌ 50,000, ఫ్యామిలీ పెన్షన్‌ 15,000 మినహా) కొత్త విధానంలో లేవు. 
  • కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 
  • 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రిటర్నులు ఫైల్‌ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. 

కొత్త పన్ను విధానం 115 BAC (1A) ప్రకారం  

  • రూ.3 లక్షల వరకు 0% పన్ను
  • రూ.3-6 లక్షల వరకు 5% పన్ను
  • రూ.6-9 లక్షల వరకు 10% పన్ను
  • రూ.9-12 లక్షల వరకు 15% పన్ను
  • రూ.12-15 లక్షల వరకు 20% పన్ను
  • రూ.15 లక్షలకు పైన 30% పన్ను 

పాత పన్ను విధానం ప్రకారం 

  • రూ. 2.5 లక్షల వరకు 0% పన్ను
  • రూ. 2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను
  • రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను
  • రూ. 10 లక్షలకుపైన 30% పన్ను
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని