Aviation Summit-2024: దేశంలో మరిన్ని ఎయిర్‌స్క్రిప్ట్‌లు

దేశంలో విమాన అనుసంధానతను పెంచడం కోసం మరిన్ని ఎయిర్‌స్ట్రిప్‌లు (చిన్నపాటి విమానాశ్రయాలను) అభివృద్ధి చేయాలని పౌర విమానయాన శాఖ భావిస్తోంది.

Published : 06 Jun 2024 03:19 IST

పౌర విమానయాన శాఖ కార్యదర్శి
25000 సీట్లకు ఎయిరిండియా ఆర్డరు
నిధుల సమీకరణలో ఇండిగో, స్పైస్‌జెట్‌
కాపా ఇండియా ఏవియేషన్‌ సమిట్‌ 2024

దిల్లీ: దేశంలో విమాన అనుసంధానతను పెంచడం కోసం మరిన్ని ఎయిర్‌స్ట్రిప్‌లు (చిన్నపాటి విమానాశ్రయాలను) అభివృద్ధి చేయాలని పౌర విమానయాన శాఖ భావిస్తోంది. దీంతోపాటు పెద్ద, మధ్యస్థాయి విమానాశ్రయాలతో అనుసంధానానికి నిబంధనలను సవరించాలని చూస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి వుమ్లంగామ్‌ వూల్నమ్‌ పేర్కొన్నారు. బుధవారమిక్కడ జరిగిన కాపా ఇండియా ఏవియేషన్‌ సమిట్‌-2024లో మాట్లాడుతూ ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న విమానయాన మార్కెట్లో మనదేశం ఒకటని తెలిపారు. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రాయాల సంఖ్య 74 నుంచి 157కు పెరిగినట్లు వివరించారు. దేశంలో 453 ఎయిర్‌స్ట్రిప్‌లు ఉండగా, 157 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. మరిన్నింటిని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇందువల్ల రెండో, మూడో శ్రేణి నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే యత్నాల్లో భాగంగా, విమానాల్లో సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌(ఎస్‌ఏఎఫ్‌)ను వినియోగించడానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 2024-25లో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6-8% వృద్ధితో 16.1-16.4 కోట్లకు, అంతర్జాతీయ రద్దీ 9-11% పెరిగి 7.5-7.8 కోట్లకు చేరొచ్చని కాపా ఇండియా అంచనా వేసింది.ఈ సదస్సులో పాల్గొన్న వివిధ విమానయాన కంపెనీల ప్రతినిధులు ఏమన్నారంటే..

ఎయిరిండియా 100 విమానాల నవీకరణ

40 పెద్ద విమానాలు సహా మొత్తం 100కు పైగా విమానాలను నవీకరిస్తున్నట్లు ఎయిరిండియా అధిపతి క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 25,000 విమాన సీట్లకు ఆర్డరు ఇచ్చినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే విమాన ఛార్జీల్లో వృద్ధి తక్కువగానే ఉన్నట్లు వివరించారు. 

ఏడాది చివరకు విస్తారా విలీనం

ఏఐఎక్స్‌ కనెక్ట్‌(అంతక్రితం ఎయిరేషియా ఇండియా) విలీన ప్రక్రియలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎండీ అలోక్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేసే పని పూర్తికావొచ్చని విస్తారా సీఈఓ వినోద్‌ కన్నన్‌ పేర్కొన్నారు.  

రూ.2,075 కోట్ల సమీకరణలో స్పైస్‌జెట్‌

వచ్చే కొద్ది నెలల్లో 250 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.2075 కోట్లు) నిధులను స్పైస్‌జెట్‌ సమీకరించనున్నట్లు కంపెనీ అధిపతి అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తద్వారా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, సమస్యలు తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే 150 మి. డాలర్లను కంపెనీ సమీకరించిన సంగతి తెలిసిందే.

2027కల్లా పెద్ద విమానాలు: ఇండిగో

2027 కల్లా ఇండిగో వద్దకు పెద్ద (వైడ్‌ బాడీ) విమానాలు చేరనున్నాయి. ఇందుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు వేర్వేరు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో 30 వరకు ఏ350-900 విమానాలకు సంస్థ ఆర్డరు పెట్టింది. మరో 70 విమానాల కొనుగోలుకూ ఆప్షన్‌ ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 360కు పైగా విమానాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని