కోటక్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్‌.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధించింది. ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.

Updated : 24 Apr 2024 17:30 IST

Kotak Mahindra Bank | ముంబయి: ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు (Kotak Mahindra Bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో బుధవారం ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది.

2022, 2023 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఐటీ పరిశీలనలో గుర్తించిన లోపాలను సమగ్రంగా, సమయానుకూలంగా పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైనందున చర్యలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, యూజర్‌ యాక్సస్‌ మేనేజ్‌మెంట్‌, వెండార్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెక్యూరిటీ అండ్‌ డేటా లీక్‌ ప్రివెన్షన్‌ స్ట్రాటజీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు గుర్తించినట్లు తన ప్రకటనలో తెలిపింది. ఐటీ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విషయంలో ఆ రెండు సంవత్సరాలు మార్గదర్శకాలను పాటించలేదని ఆర్‌బీఐ పేర్కొంది.

యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్‌’ టీవీ యాప్‌!

ఈనేపథ్యంలోనే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా, క్రెడిట్ కార్డుల జారీపైనా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పటికే ఉన్న క్రెడిట్‌ కార్డుదారులకు, ఇతర కస్టమర్లకు ఎప్పటిలానే సేవలందించొచ్చని తెలిపింది. ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతితో బ్యాంకు.. సమగ్ర ఆడిట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. దాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ సమీక్షించి, బ్యాంకు చేపట్టిన చర్యలపై సంతృప్తి చెందితే ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటుంది. 2020లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పైనా ఆర్‌బీఐ ఈతరహా ఆంక్షలనే విధించింది. క్రెడిట్‌ కార్డుల జారీని నిలిపివేసింది. 2021 ఆగస్టులో ఆంక్షలు ఎత్తివేసింది. మరోవైపు ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో కోటక్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని