SBI Results: క్షీణించిన ఎస్‌బీఐ లాభం.. ఆదాయంలో వృద్ధి

SBI Q3 Results: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర లాభం క్షీణించింది. మూడో త్రైమాసికానికి గాను ఆదాయంలో మాత్రం వృద్ధిని నమోదు చేసింది.

Updated : 03 Feb 2024 15:31 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిన రూ.9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం క్షీణించడం గమనార్హం. అప్పట్లో రూ.14,205 కోట్ల నికర లాభాన్ని ఎస్‌బీఐ నమోదు చేసింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.98,084 కోట్ల నుంచి రూ.1,18,193 కోట్లకు పెరిగినట్లు ఎస్‌బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

సమీక్షా త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 3.14 శాతం నుంచి 2.42 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.77 శాతం నుంచి 0.64 శాతానికి తగ్గాయి. ఏకీకృత ప్రాతిపదికన ఎస్‌బీఐ గ్రూప్‌ నికర లాభం 29 శాతం క్షీణించి రూ.11,064 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో గ్రూప్‌ నికర లాభం రూ.15,477 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.1,27,219 కోట్ల నుంచి రూ.1,53,072 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్స్‌లో ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ 20 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో పెన్షన్‌ ఫండ్స్‌ లిమిటెడ్‌లో బ్యాంక్‌ వాటా 60 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది. ఇందుకోసం రూ.229.52 కోట్లు వెచ్చించినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని