Sebi: దృశ్యమాధ్యమ పద్ధతిలో కంపెనీల వివరాలు

పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే కంపెనీలు, ఆఫర్‌ పత్రాల్లోని వివరాలను దృశ్య మాధ్యమ (ఏవీ) పద్ధతిలోనూ వెల్లడించే విధానాన్ని తీసుకురావాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం నిర్ణయించింది.

Published : 25 May 2024 02:24 IST

దిల్లీ: పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే కంపెనీలు, ఆఫర్‌ పత్రాల్లోని వివరాలను దృశ్య మాధ్యమ (ఏవీ) పద్ధతిలోనూ వెల్లడించే విధానాన్ని తీసుకురావాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం నిర్ణయించింది. ఆఫర్‌లోని కీలక వివరాలను మదుపర్లు సులభంగా అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని సెబీ భావిస్తోంది. అన్ని ప్రధాన పబ్లిక్‌ ఇష్యూల ఏవీలను సిద్ధం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. తొలుత ఆంగ్లం, హిందీ భాషల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. జులై 1 నుంచి వచ్చే అన్ని కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు స్వచ్ఛందంగా, అక్టోబరు 1 నుంచి తప్పనిసరిగా ఈ నియమావళి అమలు కానుందని సెబీ సర్క్యులర్‌లో పేర్కొంది. ఒక్కో కంపెనీ ఏవీ దాదాపు 10 నిమిషాల కాలావధితో ఉండే అవకాశం ఉంది. మదుపర్లను తప్పుదోవ పట్టించేలా ఇది ఉండకూడదు. కంపెనీ ప్రచారానికి కాకుండా, మదుపర్లు తాము ఎందుకు పెట్టుబడి పెట్టాలో వివరించేలా ఈ ప్రదర్శన ఉండాలి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల వెబ్‌సైట్లతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ అందుబాటులో ఉండాలి. 

ఈ వివరాలన్నీ ఉండాలి: ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు కారణాలు, నష్టభయం అంచనాలు, పెట్టుబడి ఎలా వినియోగిస్తారు, కంపెనీ ఏ వ్యాపారాల్లో ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, న్యాయ వివాదాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలన్నీ ఏవీలో ఉండాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని