Stock market: బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ @ 5 ట్రిలియన్‌.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock market: స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడింది.

Published : 21 May 2024 16:10 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. మరోవైపు ఇంట్రాడేలో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ తొలిసారి 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కును (రూ.414 లక్షల కోట్లు) అందుకుంది. 2023 నవంబర్‌లో 4 ట్రిలియన్ డాలర్లు దాటగా.. ఆరు నెలల వ్యవధిలోనే మరో మైలురాయిని అందుకుంది.

సెన్సెక్స్‌ ఉదయం 73,842.96 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,005.94) నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం కాసేపు లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 73,762.37 - 74,189.19 మధ్య కదలాడింది. చివరికి 52.63 పాయింట్ల నష్టంతో 73,953.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.05 పాయింట్లు లాభపడి  22,529.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.31గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో  బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ ధర 82.83 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని