Stock market: సెన్సెక్స్‌..నిఫ్టీ రికార్డుల హోరు

ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్‌ చెల్లిస్తామన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలు పెరిగాయి.

Published : 24 May 2024 04:43 IST

ప్రభుత్వానికి ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌తో జీవనకాల కొత్త గరిష్ఠాలకు సూచీలు
రూ.420 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్‌ చెల్లిస్తామన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల నికరలాభాలు  రూ.3 లక్షల కోట్లను మించడమూ ప్రభావం చూపింది. జూన్‌ 4న మార్కెట్లు మరింత దూసుకెళ్తాయని ప్రధాని ప్రకటించడం, మదుపర్లలో ధీమా పెంచింది. ఫలితంగా గురువారం దేశీయ సూచీలు కదం తొక్కాయి. బ్యాంకింగ్, చమురు, వాహన షేర్లు దూసుకెళ్లడంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఈ ఏడాది జనవరి 29 తర్వాత, అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదు చేసిన సెన్సెక్స్, మళ్లీ 75,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ కూడా 23,000 పాయింట్లకు చేరువైంది. ‘బుద్ధ పూర్ణిమ’ సందర్భంగా గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయలేదు.

మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గురువారం ఒక్కరోజే రూ.4.28 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.420.22 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,253.53 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 75,499.91 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 369.85 పాయింట్లు పెరిగి 22,967.65 దగ్గర స్థిరపడింది. ఈ సూచీ 22,993.60 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

  • అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ చేరొచ్చన్న వార్తలతో, గ్రూప్‌ కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.01%, ఎన్‌డీటీవీ 7.56%, అదానీ పోర్ట్స్‌ 4.72%, ఏసీసీ 2.86%, అదానీ పవర్‌ 2.79%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 2.30%, అంబుజా సిమెంట్స్‌ 2.09%, అదానీ విల్మర్‌ 1.85%, అదానీ గ్రీన్‌ 1.25%, అదానీ ఎనర్జీ 1.17% రాణించాయి. 10 గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.17.23 లక్షల కోట్లుగా నమోదైంది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 దూసుకెళ్లాయి. ఎల్‌ అండ్‌ టీ 3.64%, ఎం అండ్‌ ఎం 3.55%, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.30%, మారుతీ 3.16%, అల్ట్రాటెక్‌ 2.74%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.22%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.99%, రిలయన్స్‌ 1.80%, టీసీఎస్‌ 1.66% లాభపడ్డాయి. 
  • రాణించిన గో డిజిట్‌: గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేరు ఇష్యూ ధర రూ.272తో పోలిస్తే, బీఎస్‌ఈలో 3.34% లాభంతో రూ.281.10 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 15.44% పెరిగిన షేరు రూ.314 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 12.40% లాభంతో రూ.305.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.28,043.46 కోట్లుగా నమోదైంది. 2020లో గో డిజిట్‌లో ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రూ.2 కోట్లు, ఆయన భార్య అనుష్క శర్మ రూ.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో ఒక్కో షేరు రూ.75 చొప్పున కొనుగోలు చేయగా, ప్రస్తుతం దాని విలువ నాలుగింతలైంది..
  • రుణ పరిష్కార ప్రణాళికను అమలు చేసేందుకు అదనంగా 90 రోజుల సమయం ఇవ్వాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీని రిలయన్స్‌ క్యాపిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ కోరారు. ప్రస్తుత గడువు ఈ నెల 27న ముగియనుంది. 
  • ఎలక్ట్రిఫికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వెర్టెలోకు దశలవారీగా 3000 విద్యుత్‌ వాహనాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎంజీ మోటార్‌ తెలిపింది.
  • నోయిడాలో 650 ఫ్లాట్‌లను రూ.2000 కోట్లకు విక్రయించినట్లు గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ వెల్లడించింది. ఈ నెలలోనే ఈ ప్రాజెక్టును సంస్థ ప్రకటించింది.
  • కంపెనీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49% వరకు పెంచేందుకు వాటాదార్ల అనుమతిని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోరింది.
  • సన్‌ఫార్మాలో కంపెనీ విలీన ఒప్పందానికి టారో వాటాదార్లు ఆమోదం తెలిపారు. 
  • హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌కు చెందిన కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ గ్రూప్‌ (సీటీజీ) ఆస్తులు కొన్నింటిని 225 మి. డాలర్ల (సుమారు రూ.1,874 కోట్ల)కు కొనుగోలు చేస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది.

5 లక్షల కోట్ల డాలర్లకు ఎన్‌ఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్‌ విలువ గురువారం 5 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.416.57 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. 2017 జులైలో ఈ విలువ 2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2021 మే నెలలో 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందుకు 46 నెలల సమయం పట్టింది. 2023 డిసెంబరులో 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరింది. అక్కడ నుంచి 6 నెలల్లోపే మరో లక్ష కోట్ల డాలర్ల మేర విలువ పెరిగింది. ఈ ఎక్స్ఛేంజీలో అత్యంత విలువైన కంపెనీలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ ఉన్నాయి.


నేటి బోర్డు సమావేశాలు: ఎన్‌టీపీసీ, హిందాల్కో, కర్ణాటక బ్యాంక్, టొరెంట్‌ ఫార్మా, సాయి సిల్క్స్‌ కళామందిర్, అశోక్‌ లేలాండ్, బాష్, యునైటెడ్‌ స్పిరిట్స్, సుజ్లాన్‌ ఎనర్జీ, హడ్కో, కొచ్చిన్‌ షిప్‌యార్డ్, హిందుస్థాన్‌ కాపర్, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, సన్‌ టీవీ నెట్‌వర్క్, మణప్పురం ఫైనాన్స్, డోమ్స్‌ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్, జేఎం ఫైనాన్షియల్, ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్, హెచ్‌సీసీ, జామ్నా ఆటో, నజారా టెక్నాలజీస్, కోల్టే-పాటిల్‌ డెవలపర్స్, ఓరియెంట్‌ గ్రీన్‌ పవర్, ఎన్‌ఐఐటీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు