Stock market: 4 రోజుల నష్టాలకు బ్రేక్‌.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 19 Apr 2024 18:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌- ఇరాన్ నడుమ నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు పడుతూ వస్తున్నాయి. అయితే, తమ దేశం భూభాగంపై తాజాగా జరిగిన పేలుడు ఘటనలకు ప్రతీకార దాడులు చేయబోమంటూ ఇరాన్‌ పేర్కొనడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది సూచీల పరుగుకు కారణమైంది.

ఉదయం 71,999.65 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం వరకు అదే పంథాలో కొనసాగింది. తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. ఇంట్రాడేలో 71,999.65- 73,210.17 పాయింట్ల మధ్య చలించింది. చివరికి 599 పాయింట్లు లాభపడి 73,088.33 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 151 పాయింట్లు లాభపడి 22,147 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.46గా ఉంది. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, నెస్లే ఇండియా, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో  బ్రెంట్‌ క్రూడ్‌ రకం బ్యారెల్‌ చమురు ధర 86.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని