Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 790 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 28 Feb 2024 16:13 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,200 స్థాయిని కోల్పోయింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,162.82 స్వల్ప లాభాల్లో ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,222.29 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 790.34 పాయింట్ల నష్టంతో 72,304.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 247.20 పాయింట్ల నష్టంతో 21,951.15 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.92గా ఉంది. మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. వాటి మార్కెట్‌ విలువ రూ.386 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 82.84 వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు ధర 2034 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మార్కెట్‌ పతనానికి కారణాలివే..

  • అమెరికా నుంచి కీలక గణాంకాలు వెలువడనున్నాయి. జనవరి నెల వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన ధరల సూచీ గణాంకాలు వెలువడనున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలను ఈ గణాంకాలు ప్రభావితం చేయనున్నాయి.
  • ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు చాలావరకు నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై ఉంది. విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు కూడా మరో కారణం.
  • ఇటీవల కాలంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు కనిష్ఠాల వద్ద కొనుగోలు చేసి గరిష్ఠాల వద్ద విక్రయించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆయా స్టాక్స్‌ విలువలు పెరగడం కూడా ఓ కారణమని మార్కెట్‌ నిపుణుల చెబుతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని