State Bank of India: అత్యుత్తమ బ్యాంక్‌’గా ఎస్‌బీఐ

Eenadu icon
By Business News Desk Updated : 29 Aug 2024 02:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇదే మనందరి లక్ష్యం
ఉద్యోగులకు నూతన ఛైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి సందేశం 

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు శెట్టితో ఆయన సతీమణి శ్రీదేవి

‘ఉద్యోగులు, అధికారులు.. అందరం కలిసి దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను తీర్చదిద్దాలి. ఈ దశాబ్దం ప్రారంభంలో మార్కెట్‌ విలువ పరంగా అంతర్జాతీయ బ్యాంకుల్లో ఎస్‌బీఐ 52వ స్థానంలో ఉండగా.. ఇపుడు 35 స్థానాలు మెరుగుపరచుకుని 17వ స్థానానికి చేరింది. ఇప్పటి దాకా పనిచేసిన ఛైర్మన్లకు ఈ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ పునాదిపై మరింతగా ఎదిగి, అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా ఎస్‌బీఐను మలుద్దాం. అందుకు నికర లాభాలను పెంచుకోవాలి. మరిన్ని కోట్ల మంది జీవితాల్లోకి వెళ్లాలి. ఇదంతా జరగడానికి మీ సహకారం కావాలి. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి, అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్న తరుణంలో.. ఎస్‌బీఐ దశాబ్దంగానూ తీర్చిదిద్దుదాం’ అని ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు శెట్టి సందేశమిచ్చారు.

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా తెలుగు వారైన చల్లా శ్రీనివాసులు శెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం పదవీ విరమణ చేసిన దినేశ్‌ ఖరా స్థానంలో సీఎస్‌ శెట్టి బాధ్యతలు స్వీకరించినట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఎస్‌బీఐ తెలిపింది. శెట్టి బ్యాంక్‌లో ఇప్పటిదాకా అత్యంత సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ)గా ఉన్నారు. ఎస్‌బీఐలోని సంప్రదాయం ప్రకారం.. బ్యాంక్‌ ఎండీల నుంచే ఛైర్మన్‌ నియామకం జరుగుతోంది. సాధారణంగా సీనియర్‌ ఎండీకే ఆ అవకాశం దక్కుతుంటుంది.  1988లో ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీఓ)గా ఎస్‌బీఐలో తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టిన శ్రీనివాసులు.. ఇపుడు అదే బ్యాంక్‌లో ఛైర్మన్‌గా అత్యున్నత బాధ్యతలు నెరపే స్థాయికి ఎదగడం విశేషం.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా..

శ్రీనివాసులు శెట్టి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా (ఉమ్మడి పాలమూరు జిల్లా) మానవ పాడు మండలం, పెద్ద పోతుల పాడులో జన్మించారు. ఏడో తరగతి వరకు సొంతూర్లోనే ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్‌ వరకు గద్వాలలో, ఆ తర్వాత హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేర్వేరు టాస్క్‌ ఫోర్స్‌లు/కమిటీలకు ఈయన నేతృత్వం వహించారు.

ఎన్నో హోదాల్లో.. ఎన్నో బాధ్యతల్లో..

మూడు దశాబ్దాల బ్యాంకింగ్‌ కెరియర్‌లో శెట్టి ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. కార్పొరేట్‌ రుణాలు, రిటైల్, డిజిటల్, అంతర్జాతీయ బ్యాంకింగ్, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకింగ్‌ వంటి విభాగాల్లో అపార అనుభవం ఆయన సొంతం. ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (స్ట్రెస్డ్‌ అసెట్స్‌ రెసొల్యూషన్‌ గ్రూప్‌), చీఫ్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్‌ (కార్పొరేట్‌ అకౌంట్స్‌ గ్రూప్‌), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (కమర్షియల్‌ బ్రాంచ్‌- ఇండోర్‌), వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ (సిండికేషన్స్‌-న్యూయార్క్‌ బ్రాంచ్‌).. ఇలా పలు హోదాల్లో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

రూ.7,500 కోట్ల సమీకరణ: ఎస్‌బీఐ తొలిసారిగా బాసెల్‌ 3 నిబంధనల కింద టైర్‌-2 బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.7,500 కోట్లు సమీకరించినట్లు బుధవారం ప్రకటించింది. ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ.5000 కోట్లు కాగా.. రూ.8,800 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.

ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు వస్తే డిపాజిట్లు పెరగొచ్చు

ఈక్విటీ మార్కెట్లలో ఏదైనా దిద్దుబాటు కనిపిస్తే.. బ్యాంకుల్లోకి మళ్లీ డిపాజిట్లు పెరుగుతాయనే అభిప్రాయాన్ని ఎస్‌బీఐ ఎండీ అశ్వినీ తెవారి వ్యాఖ్యానించారు. తక్కువ వ్యయం డిపాజిట్ల వృద్ధికి జన్‌ధన్‌ ఖాతాలపై ఎస్‌బీఐ ఆధారపడుతోందని అన్నారు.

Tags :
Published : 29 Aug 2024 02:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని