Stock Market: మూడోరోజూ రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 20,900 పైన ముగిసిన నిఫ్టీ

Stock Market Closing bell: సెన్సెక్స్‌ 357.59 పాయింట్లు లాభపడి 69,653.73 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 82.60 పాయింట్లు పెరిగి 20,937.70 వద్ద ముగిసింది.

Published : 06 Dec 2023 16:22 IST

Stock Market Closing bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం వరుసగా మూడోరోజూ రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. ఐటీ, ఇంధన రంగ షేర్లు సూచీల లాభాలకు దోహదం చేశాయి. చమురు ధరల్లో స్థిరీకరణ, అమెరికాలో వడ్డీరేట్ల కోత సంకేతాలు.. స్టాక్‌ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాయి.

సెన్సెక్స్‌ మంగళవారం నాటి ముగింపైన 69,296.14తో పోలిస్తే 357.59 పాయింట్లు లాభపడి 69,653.73 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 69,744.62 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిన్న 20,855.1 దగ్గర స్థిరపడ్డ నిఫ్టీ ఈరోజు 82.60 పాయింట్లు పెరిగి 20,937.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 20,961.95 దగ్గర రికార్డు స్థాయిని అందుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.32 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌-30 సూచీలో విప్రో, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డ షేర్ల జాబితాలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

‘జీవన్‌ ఉత్సవ్‌’ పేరిట ఒక కొత్త పాలసీని తీసుకొచ్చిన బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (LIC).. త్వరలో మరికొన్ని ఆర్థిక ఉత్పత్తులనూ ప్రవేశపెడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సంస్థ షేరు ర్యాలీ అవుతోంది. ఈరోజు కంపెనీ షేరు (LIC Share) విలువ 4.47 శాతం పుంజుకొని రూ.746 దగ్గర స్థిరపడింది. గతవారం రోజుల్లో ఈ స్టాక్‌ 9.22 శాతం, గత నెలరోజుల్లో 22.13 శాతం లాభపడడం విశేషం.

అదానీ గ్రూప్‌ (Adani Group) నమోదిత సంస్థల షేర్లు బుధవారం కూడా రాణించాయి. ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ మినహా గ్రూపులోని మిగిలిన నమోదిత కంపెనీల షేర్లన్నీ లాభపడ్డాయి. దీంతో అన్ని కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.15 లక్షల కోట్లకు చేరింది. ఈరోజు అత్యధికంగా అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు బీఎస్‌ఈలో 19.98 శాతం పెరిగి రూ.1,053.65 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని