Summer vacation: వేసవి విహారం అదరహో

వేసవిలో ఎండలు మండుతాయి కాబట్టి, పిల్లలకు సెలవులిస్తారు. సహజంగానే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లేందుకు, పుణ్యక్షేత్రాలకు పర్యటనలు ఈ సమయంలో చేస్తారు. దీంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు దేశీయులు ఈ వేసవిలో శీతల ప్రాంతాలకు.. ముఖ్యంగా హిల్‌ స్టేషన్లకు తరలి వెళ్లడం గణనీయంగా పెరిగింది.

Published : 27 May 2024 03:11 IST

2023తో పోలిస్తే 40 శాతం వృద్ధి
ఆతిథ్య, ప్రయాణ సేవల సంస్థలకు గిరాకీ

దిల్లీ: వేసవిలో ఎండలు మండుతాయి కాబట్టి, పిల్లలకు సెలవులిస్తారు. సహజంగానే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లేందుకు, పుణ్యక్షేత్రాలకు పర్యటనలు ఈ సమయంలో చేస్తారు. దీంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు దేశీయులు ఈ వేసవిలో శీతల ప్రాంతాలకు.. ముఖ్యంగా హిల్‌ స్టేషన్లకు తరలి వెళ్లడం గణనీయంగా పెరిగింది. గత ఏడాది వేసవితో పోలిస్తే ఈసారి వేసవి ప్రయాణాలు 40% పెరిగాయి. దీంతో ఆతిథ్య, ప్రయాణ సేవల సంస్థలకు బలమైన గిరాకీ లభించింది. దీంతోపాటు పార్లమెంట్, కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలూ జరుగుతున్నందున.. నాయకులు-సంబంధితుల ప్రయాణాలూ పెరిగాయి. ఈ ప్రభావం కార్పొరేట్‌ సమావేశాలు, ప్రదర్శనల వ్యాపారంపై కొంత మేర పడింది. అయితే రాజకీయ పర్యటనల వల్ల హోటళ్లలో రిటైల్‌ వ్యాపారానికి గిరాకీ పెరిగింది.

  • ‘ఉత్తరాది వారు ఎండ వేడిని తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వేసవి విడిదికి వెళ్లేందుకు మొగ్గు చూపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేసవి ప్రయాణాలు 30-40 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయ’ని హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్, ర్యాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌-దక్షిణాసియా కేబీ కఛ్రూ వెల్లడించారు. 
  • మేక్‌మైట్రిప్‌ వేసవి ప్రయాణి ధోరణి గమనిస్తే, కుటుంబ ప్రయాణాల విభాగం 2023తో పోలిస్తే ఈసారి 20% వృద్ధిని నమోదు చేసింది. ఒంటరి ప్రయాణాలు కూడా  10% అధికమయ్యాయని  మేక్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ రాజేశ్‌ మ్యాగో వెల్లడించారు.
  • ‘కార్పొరేట్‌ సంస్థల నుంచి లభించే వ్యాపారంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం కొంతమేర పడినా, రిటైల్‌ వ్యాపారం 20% వృద్ధి నమోదు చేసింద’ని రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ సీఎండీ చందర్‌ కె.బాల్జీ వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్, కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాలపై హోటళ్లు, రిసార్టులు, ఇతర లీజర్‌ గమ్యస్థానాలు అధిక ప్రయోజనం పొందాయని పేర్కొన్నారు. మషోబ్రా (హిమాచల్‌ప్రదేశ్‌) రిటైల్‌ వ్యాపారం అయిందింతలు పెరిగిందని తెలిపారు. ముస్సోరి రిటైల్‌ ఆక్యుపెన్సీ రెండింతలు, గోవా 50% వృద్ధి నమోదు చేశాయని తెలిపారు.
  • ఆతిథ్య, ట్రావెల్‌-టెక్‌ సంస్థ ఓయో ప్రకారం.. 2024 మే, జూన్‌ బుకింగ్‌లలో బీచ్‌ గమ్యస్థానాలకు ప్రయాణికులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం లీజర్‌ బుకింగ్‌లలో 53% బీచ్‌ బుకింగ్‌లు ఉంటున్నాయని పేర్కొంది. అత్యధికులు సందర్శిస్తున్న బీచ్‌ గమ్యస్థానంగా గోవా ఉందని తెలిపింది. దీని తర్వాత వర్కాలా, పుదుచ్చేరి, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ఐలాండ్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. నైనిటాల్, రిషికేశ్, మనాలీ, ముస్సోరి, డార్జిలింగ్‌ వంటి పర్వత ప్రాంతాలకు వెళ్లేందుకు యాత్రికులు మొగ్గు చూపుతున్నారు.

ఎక్కువ మంది విహార యాత్రలకు ఎంపిక చేసుకున్న ప్రాంతాలు: హిమాచల్‌ ప్రదేశ్, కశ్మీర్, గోవా, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని