GCG shares: బీసీజీ షేర్ల ట్రేడింగ్‌పై జూన్‌ 14 నుంచి సస్పెన్షన్‌

బీసీజీ (బ్రైట్‌కామ్‌ గ్రూపు) సంస్థకు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై బీఎస్‌ఈ, ఎన్‌ఎన్‌సీ సస్పెన్షన్‌ విధించాయి.

Updated : 16 May 2024 02:02 IST

స్టాక్‌ ఎక్స్ఛేంజీల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: బీసీజీ (బ్రైట్‌కామ్‌ గ్రూపు) సంస్థకు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై బీఎస్‌ఈ, ఎన్‌ఎన్‌సీ సస్పెన్షన్‌ విధించాయి. జూన్‌ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ‘గత ఆర్థిక సంవత్సరం 2, 3 త్రైమాసికాల ఆర్థిక ఫలితాలను బ్రైట్‌కామ్‌ గ్రూపు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించనందునే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింద’ని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దీని ప్రకారం 2 వారాల పాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బీసీజీ షేర్ల ట్రేడింగ్‌ పూర్తిగా నిలిచిపోతుంది. ఆ తర్వాత ప్రతి వారంలో మొదటి రోజైన సోమవారం ట్రేడింగ్‌కు అవకాశం ఇస్తారు. ఈ విధానం 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అన్ని నిబంధనలను కంపెనీ పాటించిన పక్షంలో, ప్రతి రోజూ షేర్ల ట్రేడింగ్‌కు అవకాశం లభిస్తుంది. లేని పక్షంలో ట్రేడింగ్‌పై ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంటుంది.

గత ఏడాది నుంచే చర్యలు: గత ఏడాదిలో బీసీజీపై సెబీ కొన్ని చర్యలు తీసుకుంది. ప్రమోటర్ల షేర్లను ఫ్రీజ్‌ చేయడం, బోర్డులో మార్పులు చేయాలని నిర్దేశించడం, ఖాతాలను తిరిగి పరిశీలించి, సరిదిద్దాలని సూచించడం.. వంటివి ఇందులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా షేర్ల ట్రేడింగ్‌పై సస్పెన్షన్‌ అమల్లోకి వచ్చింది. ఈ పరిస్థితులు ఈ కంపెనీ వాటాదార్లకు ఇబ్బందికరంగా మారాయి. దీనికి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని వాటాదార్లు స్పష్టం చేస్తున్నారు. ఈ కంపెనీల్లో ప్రమోటర్లకు 18.38% వాటా మాత్రమే ఉంది. అదే సమయంలో రిటైల్‌ మదుపరులకు 37.89% వాటా ఉంది. దాదాపు 5.7 లక్షల మంది రిటైల్‌ మదుపరులు ఉన్నారు.  పలు విదేశీ సంస్థలు కూడా ఇందులో వాటాదార్లుగా ఉన్నాయి. ఎల్‌జీఓఎఫ్‌ గ్లోబల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌కు 2.48%, శంకర్‌ శర్మకు 1.14%, సుబ్రతో సహాకు 2.02% వాటా ఉండటం గమనార్హం. ట్రేడింగ్‌ నిలిచిపోతే ఈ కంపెనీ షేర్లను వాటాదార్లు విక్రయించలేని పరిస్థితి ఏర్పడుతుంది. బీసీజీ షేరు ప్రస్తుతం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.12.27 ధర వద్ద ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని